
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు అత్యంత సన్నిహితమైన ఫుజియాన్ నాయకులు, జనరల్స్‌పై చర్యలు మొదలయ్యాయి. అత్యంత కీలకమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హి వైడాంగ్ అరెస్టయ్యారు. వాస్తవానికి ఈ కమిషన్‌కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఛైర్మన్. ఇటీవల కాలంలో చైనా కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులను మార్చేస్తున్న క్రమంలో ఈ అరెస్ట్ జరగడం గమనార్హం.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ పదవి అత్యున్నతమైంది. ఈ అరెస్టుతో మరికొంతమంది కీలక నాయకులను కూడా అదుపులోకి తీసుకొన్నారు. ఝావో కేషి అరెస్టు కూడా అత్యంత కీలకమైంది. అతడు నాన్‌జింగ్ మిలిటరీ రీజియన్‌లో జనరల్ లాజిస్టిక్స్ లో అధిపతిగా పనిచేశారు.
దీంతోపాటు సైనిక బడ్జెట్, వనరుల కేటాయింపులు, రక్షణ పరిశ్రమలపై అతడి ప్రభావం ఉంది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హి వైడాంగ్ సెక్రటరీ అత్యంత కీలకమైన సైనిక సమాచారం లీక్ చేశారనే ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటున్నారు.
ఇక వెస్టర్న్ థియేటర్ కమాండ్ డిప్యూటీ కమాండర్, ఫుజియాన్‌లో పనిచేసే చాలామంది జనరల్స్‌ను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్టులను ఆ దేశ రక్షణ శాఖ ధృవీకరించాల్సి ఉంది. ఫుజియాన్ ఫ్యాక్షన్‌కు చెందిన మరికొందరు సీనియర్ జనరల్స్‌ను కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వాస్తవానికి ఈ ఫ్యాక్షన్ అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితమైందిగా భావిస్తారు. కానీ, అధ్యక్షుడే వారిని స్వయంగా అణచివేస్తున్నారా? లేదా సైన్యంలో తనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నవారిని అణచివేసే క్రమంలో చర్యలు తీసుకొన్నారో తెలియాల్సి ఉంది. ఇక చైనాలో గతేడాది కూడా మియావో లి అనే ఉన్నతస్థాయి సైనిక అధికారిని అరెస్టు చేశారు. ఆయన నాడు పొలిటికల్ వర్క్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతకుముందు చైనా రక్షణ మంత్రిని అరెస్టు చేశారు.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్