జగన్‌ ప్రతిపక్ష హోదా పేరిట మైండ్‌ గేమ్‌ పాలిటిక్స్‌

జగన్‌ ప్రతిపక్ష హోదా పేరిట మైండ్‌ గేమ్‌ పాలిటిక్స్‌

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా పేరిట మైండ్‌ గేమ్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. గతంలో 60కి పైగా సీట్లొచ్చినప్పుడు అసెంబ్లీకి రాని జగన్‌ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాననడం పొలిటికల్‌ స్టంటేనని ధ్వజమెత్తారు. 

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో కూటమి నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోము వీర్రాజుకు గజమాల వేసి శాలువా కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ మైండ్ గేమ్ పాలిటిక్స్​కు 2024, 29ఎన్నికల్లో చోటు లేదని స్పష్టం చేశారు. 

2014-19లో వైఎస్సార్సీపీకి 60 స్థానాలు వచ్చినా జగన్ అసెంబ్లీకీ రాలేదని, ఇప్పుడు 11సీట్లు వచ్చిన ఆయన ప్రతిపక్షహోదా ఇస్తే అసెంబ్లీకీ వస్తాననడం పొలిటికల్ స్టంట్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అనే విషయంలో బీజేపీ స్పష్టంగానే ఉందని ఆయన తెలిపారు. స్టీల్​ ప్లాంట్​కు అద్భుతమైన ప్యాకేజీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. 

రాష్ట్రంలో జగన్, కమ్యునిస్టులు ఒకే ఆలోచనతో ఉన్నారని ఆయన విమర్శించారు. దేశం, రాష్ట్రం ప్రగతి పథంలో వెళ్లే అనేక కార్యక్రమాలను ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అనుకున్నవన్ని చేస్తుందని, జగన్ చెప్పినవి చేయదని స్పష్టం చేశారు. 

ఎన్నికల మేనిఫేస్టోలోని హామీలన్నిటికి నెరవేరుస్తామని వీర్రాజు తెలిపారు. రాష్ట్ర పరిస్థితి గురించి జగన్​కు తెలుసని అయినా మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాని జగన్ ట్రాప్​లో రాష్ట్రం పడదని, రాష్ట్ర అభివృద్దే ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు.