
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ హేయమైన నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ భూముల వేలాన్ని నిలిపి వేయని పక్షంలో తాము ఆందోళన చేబడతామని బిజెపి ఎంపీ, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ హెచ్చరించారు. యూనివర్సిటీ ఈస్ట్ క్యాంపస్ లో ఉన్న ఈ 400 ఎకరాల భూమిలో వర్సిటీలోని ఎంతో ఆదరణ పొందిన మష్రూమ్ రాక్ వంటి ప్రదేశాలను ఉన్నాయని, ఈ స్థలం మన జాతీయ పక్షి అయిన నెమలులు, జింకలు, చాలా అరుదైన వృక్ష, జీవ సంపదకు నిలయంగా ఉందని ఆయన తెలిపారు.
అంతటి విశేష పర్యావరణ,అకడమిక్, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగిన ఇటువంటి స్థలాన్ని ప్రైవేట్, కార్పొరేట్ శక్తులు స్వార్థ ప్రయోజనాలకు దారాదత్తం చెయ్యాలనుకుంటున్న వైఖరి విద్య, పర్యావరణ పరిరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని సూచిస్తుందని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఐఐసి) శేరిలింగంపల్లి మండలంలోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ స్థలాన్ని రూ. 10,000 కోట్లు (అంచనా విలువ)కు మార్చి 8 నుండి 15 తారీఖు మధ్య వేలం వేయబోతున్నట్లు పత్రికా ముఖంగా ప్రకటించింది.
అయితే ఈ స్థలం న్యాయంగా సెంట్రల్ యూనివర్సిటికి చెందుతుంది, వర్సిటీ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నంబర్.25 కింద 2300 ఎకరాల స్థలాన్ని పరిశోధన, విద్యారంగ అభివృద్ధికి కేటాయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వo ఒకవైపు బీజేపీ ప్రభుత్వ ప్రైవేటీకరణను, సంపద మొత్తాన్ని పారిశ్రామికులకు, కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని విమర్శిస్తూ తాము అధికారంలోకి రాగానే దేశ సంపదను కార్పొరేట్ కంపెనీల వశం కానివ్వమని ప్రగల్భాలు పలుకుతూ ఇప్పుడు ఎవరి ప్రయోజనాలకోసం ఇటువంటి వేలంలు నిర్వహిస్తుంది? అని డా. లక్ష్మణ్ ప్రశ్నించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, ఈ స్థలాన్ని మళ్ళీ వర్సిటీకి కేటాయించి విద్య, పర్యావరణ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను చాటుకోవాలని ఆయన హితవు చెప్పారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు