
స్పష్టంగా చెప్పాలంటే ఎలాంటి శాంతి చర్చలు లేకుండా తాము ముందుకు వెళ్లగలమని, ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో తాము గెలవబోతున్నామని భారత్ లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ భరోసా వ్యక్తం చేశారు. అయినా శాంతి ఒప్పందానికి సిద్ధమవుతున్నామని, ఈ మార్గంలో వేగంగా వెళ్లాలని అనుకుంటున్నామని వెల్లడించారు.
ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడుతూ అయితే ఉక్రెయిన్, ఐరోపాలే ప్రధాన అడ్డంకులుగా కనిపిస్తోందని ఆయన విమర్సించారు. ఈ ప్రక్రియ వేగంగా సాగుతుందని వ్యక్తిగతంగా తాను అనుకోవడం లేదని తేల్చి చెప్పారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించి శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియాలో త్రైపాక్షిక సమావేశంలో చర్చించడానికి రష్యా సమాయత్తం అవుతోందని ఆయన వెల్లడించారు. ఇండియా టుడే సదస్సులో మాట్లాడుతూ ప్రస్తుత అమెరికా ప్రభుత్వ యంత్రాంగం గత ప్రభుత్వం కన్నా యుద్ధం నివారించడానికి సరైన సంకేతాలు అందిస్తోందని అభిప్రాయపడ్డారు.
యుద్ధాన్ని నివారించడమే తన అభిమతంగా ట్రంప్ వెల్లడించడాన్ని ప్రస్తావించగా, రష్యా దృక్పథంలో ప్రస్తుత పరిస్థితిపై ఉన్న ఆలోచనలను వివరించారు. “ఈ విషయాన్ని సులువుగా చెప్తాను. అమెరికా అధికార యంత్రాంగం మమ్మల్ని కలిసి చర్చించింది. సౌదీ అరేబియాలో బాగానే సమావేశం ఏర్పాటవుతుంది. అమెరికా ప్రతినిధులు ఇప్పుడు దీనిపై ఆలోచించడమే కాదు, వినడానికి కూడా సిద్ధమవుతున్నారు” అని చెప్పారు.
“మేం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌ను, యూరోపియన్లను చూస్తాం. రష్యా వైదొలగాల్సిన అవసరం ఉందని, భద్రతా హామీలు కావాలని వారు మాట్లాడుతున్నారు. దీనికి నాటో సభ్యత్వమే సరైన ప్రత్యామ్నాయం కావచ్చు ” అని అలిపోవ్ వెల్లడించారు. “ఐరోపా తిరిగి సైనికీకరణ కావాలని మాట్లాడుతున్నారు. దీనికి వారు ఇటీవల సమావేశమయ్యారు కూడా“ అని పేర్కొంటూ ఈ షరతులన్నీ మేం ఎందుకు అంగీకరించాలి? అని ప్రశ్నించారు
ట్రంప్, పుతిన్ మధ్య సమావేశానికి సిద్ధమయ్యారా? అని ప్రశ్నించగా “దాని కోసం మేం సిద్ధం” అని చెప్పారు. ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌కు, జెలెన్‌స్కీకి జరిగిన భేటీని ప్రస్తావిస్తూ ‘వాషింగ్టన్ వెళ్లే ముందు వేగంగా ఈ ప్రక్రియ సాగేందుకు జెలెన్‌స్కీ సిద్ధం కాలేదు. ఇప్పుడు తాను సిద్ధంగా ఉన్నట్టు జెలెన్‌స్కీ చెబుతున్నారు” అని రష్యా రాయబారి గుర్తు చేశారు.
జెలెన్‌స్కీని పుతిన్ కలుసుకుంటారా? అని ప్రశ్నించగా అలా జరగవచ్చని నమ్ముతున్నట్లు బదులిచ్చారు.“ జెలెన్‌స్కీ చట్టబద్ధమైన అధ్యక్షుడని అమెరికన్లు గౌరవిస్తున్నారు. కానీ మేం ఆ విధంగా నమ్మడం లేదు. అయినా సరే మేం త్రైపాక్షిక సమావేశానికి సిద్ధమవుతున్నాం” అని వివరించారు. ఇందులో భారత్ పాత్ర గురించి ఏం అనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు ఈ విషయంలో భారత్ నుంచి తామేమీ అనుకోవడం లేదని పేర్కొన్నారు. భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక పాత సంబంధాల గురించి మాట్లాడుతూ ఈ సంబంధాల భవిష్యత్ గురించి ఆశాభావంతో ఉన్నామని తెలిపారు.
భారత్- చైనా సంబంధాల విషయంలో మారుతున్న ప్రణామాల్లో రష్యా వైఖరి గురించి అడగ్గా, భారత్- చైనా మధ్య విశ్వాసం బలోపేతం చేయడానికి సానుకూలంగా ఉన్నామని చెప్పారు. రెండు వైపులా వారు అవసరమనుకుంటే తాము సాయం చేయడానికి ఇష్టంగా ఉన్నామని స్పష్టం చేశారు. “సంఘర్షణ ఆంక్షల గురించి తాము ఆలోచించడం లేదు. సమన్వయ నిబంధనల గురించి ఆలోచిస్తున్నాం. ఐరోపా, ఆసియా, మొత్తం ప్రపంచం అంతా న్యాయమైన పద్ధతులతో మంచి నమ్మకంతో పరస్పర సహకారంతో ఉండాలని కోరుకుంటున్నాం” అని వివరించారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం