
దేశ రాజధానిలోని మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించే ‘మహిళా సమృద్ధి యోజన’ పథకానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేఖా గుప్తా శనివారంనాడు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు.
మహిళా సంక్షేమం, మహిళా భద్రతకు తాను పనిచేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. ఢిల్లీలో పింక్ టాయిలెట్లు నిర్మిస్తామని ప్రకటించారు. ”ఈరోజు మహిళా దినోత్సవం. మహిళలకు రూ.2,500 సాయం అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీపై ఈరోజు మంత్రివర్గం సమావేశమైంది. ఇందుకు సంబంధించిన పథకాన్ని ఆమోదించింది” అని రేఖాగుప్తా తెలిపారు.
ఇందుకోసం బడ్జెట్‌లో రూ.5,100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. తన సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటు కానుందని, త్వరలోనే స్కీమ్ రిజిస్ట్రేషన్ ఉంటుందని, ఇందుకు సంబంధించిన పోర్టల్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతినెలా మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిన హామీకి అనుగుణంగా మహిళా సమృద్ధి యోజన పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు ఢిల్లీ మంత్రి మంజిదార్ సింగ్ సిర్సా తెలిపారు. త్వరలోనే ఒక పోర్టల్ ఏర్పాటవుతుందని, మహిళలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మంత్రులు కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పర్వేష్ వర్మలతో కూడిన కమిటీ ఈ స్కీమ్ విధివిధానాలను నిర్ణయిస్తుందని తెలిపారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు