
తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ముంబై ఉగ్రదాడిలో దోషిగా తేలిన తహవూర్ రాణా(64) పెట్టుకున్న అత్యవసర స్టే పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం అతడు లాస్ ఏంజెల్స్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు. అతడు అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్, తొమ్మిదవ సర్కూట్ జస్టిస్ వద్ద ‘స్టే కోసం అత్యవసర దరఖాస్తు’ పెట్టుకున్నాడు.
‘దరఖాస్తును జస్టిస్ కాగన్ తిరస్కరించారు’ అని అమెరికా సుప్రీంకోర్టు 2025 మార్చి 6న తన వెబ్‌సైట్ నోట్‌లో పేర్కొంది. రాణా తన దరఖాస్తును అమెరికా సుప్రీంకోర్టు అసోసియేట్ జస్టిస్ ఎలెనా కగన్‌కు సమర్పించుకున్నాడు. పాకిస్థాన్‌కు మూలాలున్న కెనడా జాతీయుడైన తనను భారత్‌లో చిత్రహింసలకు గురిచేస్తారని పిటిషన్‌లో తహవూర్ రాణా ఆరోపించాడు. మరణశిక్ష విధించే అవకాశం ఉందని ప్రాథేయపడ్డాడు.
26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారైన పాకిస్తాన్‌కు చెందిన కెనడా జాతీయుడు రాణాను అప్పగించాలని కొంత కాలంగా భారత్ అమెరికాను కోరుతోంది. దాన్ని సవాల్ చేస్తూ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా అతడి అభ్యర్థనను న్యాయస్థానాలు తిరస్కరించాయి. ముంబై దాడుల కుట్రకు మాస్టర్‌మైండ్ అని భావిస్తున్న డేవిడ్ కోల్యన్ హెడ్లీతో రాణాకు పరిచయం ఉంది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వేళ, రాణాను భారత్‌కు అప్పగిస్తామని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. “26/11 ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నాం. అలాగే త్వరలో మరింత మంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం” అని ట్రంప్ వెల్లడించారు.
More Stories
హసీనాను స్వదేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు
వంద ఏళ్లైనా ఏఐతో ప్రోగ్రామర్లను భర్తీ చేయలేరు
భారత్ ను మినహాయించి 22 దేశాలపై ట్రంప్ సుంకాలను