సావర్కర్ కేసులో రాహుల్ కు రూ 200 జరిమానా

సావర్కర్ కేసులో రాహుల్ కు రూ 200 జరిమానా

లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీకి లక్నో కోర్టు రూ.200 జరిమానా విధించింది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్‌ పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రాహుల్ గైర్హాజర్ కావడంతో కోర్టు సీరియస్ అయింది. ఆయనకు జరిమానా విధిస్తూ ఏప్రిల్ 14న తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది.

ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ బుధవారంనాడు హాజరు కావాల్సి ఉండగా, వ్యక్తిగత హాజరునించి ఆయనను మినహాయించాలని రాహుల్ తరఫు లాయర్ కోర్టును కోరారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం విదేశీ ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉందని, ఆ కారణంగా విచారణకు హాజరుకాలేరని కోర్టుకు విన్నవించారు. 

అయితే, కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. హాజరుకానుందుకు రూ.200 జరిమానా విధిస్తూ, ఏప్రిల్ 14న కచ్చితంగా తమ మందుహాజరు కావాలని ఆదేశించింది. మహారాష్ట్రలోని అకోలాలో కొద్దికాలం క్రితం జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, బ్రిటిష్ వారికి సావర్కర్ లేఖ రాశారని, తన చర్యలకు క్షమాపణ చెప్పారని, తద్వారా మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్ర్య యోధుల పోరాటాన్ని నీరుగార్చారని ఆరోపించారు. 

ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. సావర్కర్‌ను కించపరచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది నృపేంద్ర పాండే కేసు వేశారు. వీరసావర్కర్‌ను ఆంగ్లేయుల సర్వెంట్‌గా, పెన్షనర్‌గా రాహుల్ పేర్కొన్నారని, తన వ్యాఖ్యల ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల వారసత్వాన్ని ఆయన తక్కువ చేసి మాట్లాడారని, సమాజంలో విభజలను ప్రోత్సహించారని ఆరోపించారు. 

ఈ క్రమంలో సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) కింద పాండే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారితో విచారణ జరిపించాలని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కేసు విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ గైర్హాజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తదుపరి విచారణకు హాజరుకాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది.