కొమరయ్య, అంజిరెడ్డిలకు ప్రధాని మోదీ అభినందన

కొమరయ్య, అంజిరెడ్డిలకు ప్రధాని మోదీ అభినందన
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కరీంనగర్‌-నిజామాబాద్‌- ఆదిలాబాద్‌- మెదక్‌ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రత్యర్థులను మట్టికరిపించారు.  ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
బీజేపీకి అపూర్వమైన రీతిలో మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పనిచేస్తున్న తమ పార్టీ కార్యకర్తలను చూసి గర్విస్తున్నానని తెలిపారు.  కరీంనగర్‌- ఆదిలాబాద్‌- నిజామాబాద్‌- మెదక్‌ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గపు ఎమ్మెల్సీలుగా బీజేపీ అభ్యర్థులు చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమరయ్య విజయం సాధించారు.
కొమరయ్య విజయం రెండు రోజుల క్రితమే ఖరారుకాగా, పట్టభద్రుల ఫలితం బుధవారం వెలువడింది.  కాగా, గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లతో అంజిరెడ్డి గెలుపొందారు. రెండు రోజుల పాటు జరిగిన కౌంటింగ్‌ ప్రక్రియ అడుగడుగునా ఉత్కంఠ రేపింది.

మరోవైపు ఎపిలో విజయం సాధించిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలుపుతు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన పోస్ట్‌ను ప్రధాని మోదీ రీపోస్ట్ చేశారు. కేంద్రం, ఎపి ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని మోదీ పేర్కొన్నారు.