* మణిశంకర్ అయ్యర్ వాఖ్యలతో ఇరకాటంలో కాంగ్రెస్
కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి ఆ పార్టీని ఇరకాటంలో పెట్టారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అకడమిక్ రికార్డును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండుసార్లు పరీక్షల్లో ఫెయిలైన ఆయన దేశ ప్రధాని ఎలా అయ్యారోనని ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
రాజీవ్‌గాంధీ, తానూ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో కలిసి చదువుకున్నామని, అప్పటి పరీక్షల్లో ఆయన ఫెయిలయ్యారని మణిశంకర్ అయ్యర్ చెప్పారు. సహజంగా విశ్వవిద్యాలయం తమ రెప్యుటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో అందర్నీ ఉత్తీర్ణులను చేయాలని చూస్తుందని, అయితే రాజీవ్ ఫెయిల్ అయ్యారని తెలిపారు.
ఆ తర్వాత లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో కూడా రాజీవ్ గాంధీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారని చెప్పారు. ”రెండు సార్లు పరీక్షల్లో ఫెయిలై, పైలెట్‌గా పనిచేసిన వ్యక్తి దేశ ప్రధాని అవుతారని నేను ఊహించలేదు. ఇదెలా సాధ్యమయిందో?” అని మణిశంకర్ అయ్యర్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
మణిశంకర్ అయ్యర్ గతంలోనూ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన రాజకీయ కెరీర్ ఎదుగుదలకు, పతానానికి కూడా కాంగ్రెస్ పార్టీయే కారణమని చెప్పారు. అయితే, ఆయన రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే రాజకీయాలలోకి రావడం, కాంగ్రెస్ ఎంపీ కావడం, కేంద్ర మంత్రి కూడా కావడం జరిగింది.
కాగా, రెండు సార్లు ఫెయిలైన రాజీవ్ ఎలా ప్రధాని ఆయ్యారోనంటూ మణిశంకర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత అమిత్ మాలావీయ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఆయనను (అయ్యర్) ముసుగు తొలగించనివ్వండి అంటూ ఎద్దేవా చేశారు.
ఈ వివాదంపై స్పందిస్తూ, కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ అయ్యర్ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ రాజీవ్ గాంధీ వారసత్వాన్ని సమర్థించారు. “వైఫల్యం పెద్ద విషయం కాదు. ఉత్తమ వ్యక్తులు కూడా కొన్నిసార్లు విఫలమవుతారు. కానీ ఆయన రాజకీయాల్లో విఫలం కాలేదు. ప్రధానమంత్రిగా, ఆయన చాలా విజయవంతమయ్యారు” అని చెప్పారు.
“ఆయన పంచాయతీ రాజ్‌ను ప్రవేశపెట్టారు, ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చారు, కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచారు. శాస్త్రీయ పురోగతిని ప్రోత్సహించారు. కేవలం ఐదు సంవత్సరాలలో చాలా సాధించిన ప్రధానులు చాలా తక్కువ” అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి చరణ్ సింగ్ సప్రా అయ్యర్‌ను విమర్శిస్తూ పార్టీ ప్రతిష్టను పదే పదే దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. “మణిశంకర్ అయ్యర్ ప్రభావవంతమైన నాయకుడు, చాలా కాలంగా కాంగ్రెస్‌లో ఉన్నారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా, ఆయన ప్రకటనలు పార్టీకి నష్టం కలిగించాయి” అని ఆయన విచారం వ్యక్తం చేశారు.

More Stories
చండీగఢ్ బిల్లుపై దుమారం…. నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం
బెంగాల్ లో 127.7 శాతం పెరిగిన ముస్లిం ఓటర్లు
హిందువులు లేకుండా ప్రపంచం ఉనికిలో ఉండదు!