
చైనా దిగుమతులపై 20 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న చర్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధంలో చివరి వరకు పోరాడటానికి తాము సిద్ధమేనని చైనా పేర్కొంది. “అగ్రరాజ్యం మాతో యుద్ధం చేయడానికి నిశ్చయించుకుంటే అది సుంకాల యుద్ధమైనా, వాణిజ్య యుద్ధమైనా, మరే రకమైన యుద్ధమైనా, చివరి వరకు పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ” అని అమెరికా లోని చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది.
తమపై విధిస్తున్న టారిఫ్‌కు ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై తాము 10 నుండి 15 శాతం సుంకాలు విధిస్తామని తెలిపింది. ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో బీజింగ్ విఫలమవడం వల్లే టారిఫ్‌లను రెట్టింపు చేస్తున్నట్టు ట్రంప్ పేర్కొంటున్నప్పటికీ ఫెంటనిల్ సంక్షోభం దాని సొంతపనే అని డ్రాగన్ ఆరోపించింది.
“ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నాలను గుర్తించకుండా యూఎస్ తిరిగి మమ్మల్నే నిందిస్తుంది. సుంకాల పేరుతో ఒత్తిడి చేసి, బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇంతకాలం వారికి సహాయం చేసినందుకు వారు మమ్మల్ని శిక్షిస్తున్నారు” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్రపంచ దేశాలపై అమెరికా అనుసరిస్తున్న సుంకాలు, బెదిరింపు వ్యూహాలు తమపై ప్రభావం చూపవని తెలిపింది. యూఎస్ సుంకాలపై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. అగ్రరాజ్యం నుంచి దిగుమతి అవుతున్న బొగ్గు, ధ్రువీకృత సహజవాయువుపై (ఎల్ఎన్జీ) 15 శాతం సుంకం విధిస్తున్నట్టు చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది. ముడి చమురు, వ్యవసాయ పరికరాలు, పెద్ద ఇంజిన్ల కార్లపై 10 శాతం సుంకాన్ని వసూలు చేయనున్నట్లు తెలిపింది.
మరోవంక, ట్రంప్ తమపై విధించిన సుంకాల పట్ల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాను మచ్చిక చేసుకునేందుకే ట్రంప్ కెనడాతో వాణిజ్య యుద్ధానికి దిగుతున్నారని ఆయన ఆరోపించారు. ట్రంప్ తమపై 25 శాతం సుంకాలు విధిస్తే తాము అమెరికన్ వస్తువులపై 100 బిలియన్ డాలర్లకు పైగా ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రూడో ఘాటుగా హెచ్చరించారు.
More Stories
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’
శ్రీలంకలో పట్టపగలే ప్రతిపక్ష నేత దారుణ హత్య