బోఫోర్స్ దర్యాప్తు తిరిగి ప్రారంభించేందుకు సీబీఐ సిద్ధం

బోఫోర్స్  దర్యాప్తు తిరిగి ప్రారంభించేందుకు సీబీఐ సిద్ధం

బోఫోర్స్ ముడుపుల కుంభకోణం దర్యాప్తు పునఃప్రారంభించేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది. బోఫోర్స్ లంచం కుంభకోణం దర్యాప్తులో ఇది కొత్త మలుపు కానుంది. ఈ కుంభకోణంలో కీలక సమాచారం సేకరించేందుకు సీబీఐ అమెరికన్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ మైఖేల్ హెర్ష్‌మన్‌‌ను గతంలోనే అభ్యర్థించగా అతడు సానుకూలంగా స్పందించాడు. 

అనంతరం దీనికి సంబంధించి సీబీఐ అమెరికా అధికారులకు పలుమార్లు లేఖలు పంపినా స్పందన రాలేదు. తాజాగా, మైఖేల్ హెర్ష్‌మన్‌‌ నుంచి సాక్ష్యం సేకరించేందుకు కీలక ముందడుగు పడింది. ఇటీవల భారత హోంశాఖ నుంచి అమెరికాకు న్యాయపరమైన అభ్యర్థన లేఖ (లెటర్‌ రొటేటరీ) పంపేందుకు సీబీఐకి అనుమతి లభించింది.

1980ల నాటి బోఫోర్స్ కుంభకోణం అప్పట్లో దేశంలో అతిపెద్ద సంచలనం. తరచూ దేశ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. 39 సంవత్సరాల క్రితం జరిగిన ఈ దర్యాప్తు ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతూనే ఉంది. అయితే, తాజాగా ఈ కేసు మళ్లీ వార్తల్లోకెక్కింది. 2017లో ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్ చీఫ్ మైఖేల్ హెర్ష్‌మన్ భారతదేశాన్ని సందర్శించినపుడు బోఫోర్స్ కుంభకోణంపై కీలక సమాచారం వెల్లడించారు. 

విదేశాల్లోని భారతీయులు కరెన్సీ నియంత్రణ చట్టాలను ఉల్లంఘించడంతో మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేయడానికి 1986లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తనను నియమించిందని మైఖేల్ హెర్ష్‌మన్ పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్  ప్రభుత్వం ఈ కుంభకోణం దర్యాప్తును పక్కదారి పట్టించిందని, బోఫోర్స్ కేసుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సీబీఐతో పంచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

మైఖేల్ హెర్ష్‌మన్ ఆరోపణల ఆధారంగా సీబీఐ తిరిగి ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. బోఫోర్స్ కుంభకోణం 1980లలో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో కేంద్రంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ కుంభకోణం బయటపడిన తర్వాత రాజకీయంగా తీవ్ర కలకలం చెలరేగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్వీడిష్ కంపెనీ బోఫోర్స్‌తో 400 155 ఎం.ఎం. హోవిట్జర్‌ తుపాకుల కోసం రూ.1,437 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. 

ఈ ఒప్పందంలో రూ.64 కోట్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కుంభకోణం రూ.64 కోట్లు అయితే దర్యాప్తుకే రూ.250 కోట్లు ఖర్చు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. అయినా, ఈ కేసులో లంచాలు చెల్లించినట్లు నిరూపించలేకపోవడంతో 2004లో ఢిల్లీ హైకోర్టు తన తీర్పులలో ఒకదానిలో బోఫోర్స్ కేసులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది.

జనవరి 22, 1990న, సిబిఐ అప్పటి బోఫోర్స్ అధ్యక్షుడు మార్టిన్ ఆర్డ్బో, మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విన్ చద్దా,  హిందూజా సోదరులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ అభియోగం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో మొదటి ఛార్జిషీట్ అక్టోబర్ 22, 1999న చద్దా, ఒట్టావియో క్వాట్రోచి, అప్పటి రక్షణ కార్యదర్శి ఎస్ కె భట్నాగర్, ఆర్డ్బో, బోఫోర్స్ కంపెనీపై దాఖలు  చేసింది. 

అక్టోబర్ 9, 2000న హిందూజా సోదరులపై అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, మే 31, 2005న, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి (రిటైర్డ్) ఆర్ ఎస్ సోధి బోఫోర్స్ చెల్లింపు కుంభకోణంలో సిబిఐ కేసును కొట్టివేసారు. దీనికి ముందు, జస్టిస్ (రిటైర్డ్) జె డి కపూర్ ఫిబ్రవరి 4, 2004న, ఈ కేసులో రాజీవ్ గాంధీని నిర్దోషిగా విడుదల చేసి, బోఫోర్స్ కంపెనీపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 465 కింద ఫోర్జరీ అభియోగం మోపాలని ఆదేశించారు.

మార్చి 4, 2011న ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు క్వాట్రోచిని కేసు నుంచి విడుదల చేస్తూ, దేశం కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టలేమని,  ఇప్పటికే రూ. 250 కోట్లు ఖర్చయిందని పేర్కొంది. జూలై 29-30లలో, 1993న భారతదేశం నుండి పారిపోయిన క్వాట్రోచి, విచారణను ఎదుర్కోవడానికి భారతదేశంలోని ఏ కోర్టు ముందు కూడా హాజరు కాలేదు. జూలై 13, 2013న ఆయన మరణించారు. భట్నాగర్, చద్దా, ఆర్ద్బో మరణించిన ఇతర నిందితులు. 

2005 తీర్పుపై సీబీఐ 2018లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది, కానీ ఆలస్యం కారణంగా ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే, 2005లో న్యాయవాది అజయ్ అగర్వాల్ దాఖలు చేసిన అప్పీల్‌లో అన్ని అంశాలను లేవనెత్తడానికి ఆ తర్వాత సుప్రీంకోర్టు అనుమతించింది.