ప్రభుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌తో తేట‌తెల్లం

ప్రభుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌తో తేట‌తెల్లం

ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు బీజేపీకి ప‌ట్టం క‌ట్టార‌ని, ఈ విజ‌యం తిరుగులేనిద‌ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వంపై ప్ర‌జా వ్య‌తిరేక‌త ఎంత ఉందో సీఎం రేవంత్ రెడ్డికి అర్ధ‌మై ఉంటుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలకులు మారినా పాలనలో ఏ మాత్రం మార్పు లేదని స్పష్టం చేశారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రజలకిచ్చిన వాగ్దాన‌ల‌ను ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేదని ఆయన మండిప‌డ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న‌ సీఎం రేవంత్‌ను ఎవరూ పట్టించుకోవడం లేద‌ని వ్యాఖ్య‌నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందో ఎమ్మెల్సీ ఎన్నికలతో తేటతెల్లమైందని పేర్కొంటూ .ప్రజలు ఇచ్చిన విజయంతో త‌మ‌పై బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.

ఇక నుంచి తాము ‘సేవ్ తెలంగాణ – సపోర్ట్ బీజేపీ’ నినాదంతో ముందుకెళ్తామని కిష‌న్‌రెడ్డి ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని జోస్యం చెప్పారు. ఇకనైనా తెలంగాణ లో డబుల్ ఇంజిన్ సర్కార్ రాకపోతే పరిస్థితులు దయనీయంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను రెండింటిని కైవసం చేసుకున్నామని చెప్పారు. 

తెలంగాణ యువత, టీచర్లు తమపై పూర్తి నమ్మకం ఉంచి తమ అభ్యర్థులను ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా గెలిపించడం సంతోషదాయకమని తెలిపారు. కాగా, తాను మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు వస్తారని, ప్రస్తుతం తను పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగానే కొనసాగుతున్నానని కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.