ఉక్రెయిన్‌కి సైనిక సహాయాన్ని నిలిపివేసిన అమెరికా

ఉక్రెయిన్‌కి సైనిక సహాయాన్ని నిలిపివేసిన అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి గట్టి షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్కు సైనిక సాయం నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు రష్యాతో శాంతి చర్చల్లో పాల్గొనాలని జెలెన్స్కీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఓవల్ ఆఫీస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి, ట్రంప్నకు మధ్య వాడివేడి చర్చ జరిగిన తర్వాత ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

కాగా, నిర్ణయాన్ని ఉక్రెయిన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అగ్రరాజ్యం తమకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు క్రమంగా తమ దేశాన్ని రష్యాకు లొంగిపోయేలా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నట్టు ఉన్నాయని ఆ దేశ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్ మెరెజ్‌కో ఆరోపించారు. 

ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మధ్య వాగ్వాదం నెలకొన్న నేపథ్యంలో కీవ్‌పై ఒత్తిడి తీసుకురావడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని యూరోపియన్ దేశాలు ఆరోపించాయి. ఈ నిర్ణయం వల్ల ఉక్రెయిన్‌కు ఇప్పటికే అందుబాటులో ఉన్న వందల మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలపై ప్రభావం పడనుందని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో భాగంగానే ఉక్రెయిన్‌కి సైనిక సహాయాన్ని తాజాగా అమెరికా ప్రభుత్వం నిలిపివేసింది. గత శుక్రవారం జెలెన్‌స్కీ శ్వేతసౌథంలో ట్రంప్‌తో జరిపిన సమావేశంలోనే ట్రంప్‌ యుద్ధాన్ని ఆపమని సూచించారు. అయితే ట్రంప్‌ మాట పెడచెవినపెట్టి రష్యాతో యుద్ధానికి మద్దతు ఇవ్వమని జెలెన్‌స్కీ ట్రంప్‌ని కోరారు. 

అయితే ఆ సమయంలోనే జెలెన్‌స్కీపై ట్రంప్‌ మండిపడ్డారు. చేయి చేసుకున్నంత పని చేశారు. వీరిరువురు సమావేశం అయిన రెండు రోజుల అనంతరం సైనిక సహాయాన్ని నిలిపివేయాలని ట్రంప్‌ సోమవారం ఆదేశించడం గమనార్హం. రష్యాతో యుద్ధానికి ముగింపు పలికి, శాంతి చర్చలకు జెలెన్‌స్కీ సిద్ధమయ్యేంతవరకు తన సైనిక సహాయాన్ని నిలిపివేయడానికి ట్రంప్‌ సిద్ధంగా ఉన్నట్లు వైటస్‌ హౌస్‌ అధికారులు తెలిపారు. 

దాదాపు ఒక బిలియన్‌ డాలర్లు విలువ చేసే ఆయుధాలు మందుగుండు సామాగ్రిని ట్రంప్‌ ఉక్రెయిన్‌కి నిలిపివేసినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. “రష్యా, ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టి ఇప్పటికే 3 ఏళ్లు గడిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధాన్ని ఓ శాంతి ఒప్పందం ద్వారా ముగించాలని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఈ లక్ష్యానికి జెలెన్స్కీ కట్టుబడి ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్కు తాత్కాలికంగా సైనిక సాయం నిలిపివేశారు” అని  వైట్హౌస్ అధికారి ఒకరు తెలిపారు. అంతకు ముందు రష్యాతో యుద్ధం ముగింపు ఇంకా సుదూర తీరంలోనే ఉందని జెలెన్‌స్కీ తెలిపారు. అప్పటిదాకా అమెరికా సహకారం తమకు అందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దేశంతో డీల్‌కు తాను సిద్ధమేనని, ట్రంప్‌తో భేటీకి సిద్ధంగానే ఉన్నానని చెప్పారు. ఇప్పటిదాకా అమెరికా అందించిన సాయంపై ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఆదివారం లండన్‌లో ఐరోపా దేశాధినేతల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న జెలెన్‌స్కీ సమావేశం అనంతరం ఉక్రెయిన్‌కు బయలుదేరేముందు వీడియో సందేశం విడుదల చేశారు.

“అమెరికాతో మా సంబంధాలు కొనసాగుతాయనే అనుకుంటున్నాను. ఎందుకంటే అవి సందర్భానుసారం నెలకొనే సంబంధాల కంటే ఎక్కువ. అమెరికాతో మాకు బలమైన బంధం ఉందని నమ్ముతున్నాను. ఆ సత్సంబంధాలను కాపాడుకోగలను. నిర్మాణాత్మక చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తాను” అని తెలిపారు. 

“తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఖనిజాల ఒప్పందంపై ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే దానిపై సంతకం చేసేందుకూ సిద్ధమే” అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. “ఐరోపా నుంచి మాకు పూర్తి మద్దతు ఉందనేది మరోసారి స్పష్టమైంది. శాంతి పునరుద్ధరణ అనే ప్రధాన అంశంపై అంతా ఐక్యంగా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మాకు నిజమైన భద్రతా హామీలు ముఖ్యం. యూకే, ఐరోపా సమాఖ్య, తుర్కియే వంటి దేశాలు దీనిపై కృత నిశ్చయంతో ఉన్నాయి” అని తెలిపారు. 

“ఇక్కడ అమెరికా ప్రాధాన్యాన్ని కూడూ మనం అర్థం చేసుకోవాలి. ఆ దేశం మాకు అందిస్తున్న సాయంపై మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. వారికి కృతజ్ఞతలు తెలపని రోజు లేదు. మా స్వాతంత్య్రాన్ని కాపాడుతున్న వారికి ధన్యవాదాలు. మాకు కావాల్సింది సుదీర్ఘ యుద్ధం కాదు, మాకు శాంతి కావాలి. అందుకే భద్రతా హామీలు ముఖ్యమని మేం చెబుతున్నాం” అని జెలెన్స్కీ పేర్కొన్నారు.

జెలెన్‌స్కీ రష్యాతో శాంతికి చాలా దూరం అని ప్రకటించాడు. జెలెన్‌స్కీ ప్రకటనపై ట్రంప్‌ మండిపడ్డాడు. రష్యాతో ఉక్రెయిన్‌ ఎక్కువ కాలం యుద్ధం కొనసాగించడాన్ని అమెరికా భరించదు. అమెరికా మద్దతు ఉన్నంతవరకు జెలెన్‌స్కీ శాంతిని కోరుకోడు. యూరప్‌లో జరిగిన సమావేశంలో జెలెన్‌స్కీ అమెరికా మద్దతు లేనిదే యుద్ధాన్ని కొనసాగించలేము. కనుక అమెరికా మద్దతివ్వాలని చెప్పారు. 

ఈ యుద్ధానికి తాము మద్దతు ఇవ్వము. అందుకే ఉక్రెయిన్‌ సైనిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ సోషల్‌మీడియా పోస్టులో పేర్కొన్నారు. అయితే అమెరికా సైనిక సహాయాన్ని నిలిపివేయడం వల్ల జెలెన్‌స్కీకి, ట్రంప్‌కి మధ్య విబేధాలు వచ్చే అవకాశం ఉంది. కాగా, ట్రంప్‌ గతంలో అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో కూడా ఉక్రెయిన్‌కి సైనిక సహాయాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత అధ్యక్షుడిగా జో బైడెన్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉక్రెయిన్‌కి అన్నివిధాలుగా సహాయమందించారు.