భారత్‌పై ఏప్రిల్‌ 2 నుంచి ప్రతీకార సుంకాలు

భారత్‌పై ఏప్రిల్‌ 2 నుంచి ప్రతీకార సుంకాలు

భారత్‌పై ఏప్రిల్‌ 2 నుంచి ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. అధ్యక్షుడైన తర్వాత ఆ దేశ కాంగ్రెస్‌ సంయుక్త సెషన్‌లో తొలిసారి ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. భారత్‌, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్‌ 2 నుంచి అమలులోకి రానున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఆరు వారాల్లో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, విజయాలను వివరించారు. ఆరు వారాల్లో 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశానని తెలిపారు.

‘కొన్ని దేశాలు దశాబ్దాల పాటు మనపై టారిఫ్‌లు విధిస్తున్నాయి. ఇప్పుడు మన  సమయం వచ్చింది. సగటున చూస్తే ఐరోపా సమాఖ్య, చైనా, బ్రెజిల్‌, భారత్‌ వంటి చాలా దేశాలు మన నుంచి అధికంగా వసూలు చేస్తున్నాయి. భారత్‌ మనపై 100 శాతం కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తోంది. మన ఉత్పత్తులపై చైనా సగటు సుంకం మనం వసూలు చేసే దానికంటే రెండింతలు ఎక్కువ. ఇక దక్షిణ కొరియా సగటు సుంకం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది” అని ట్రంప్ వివరించారు.

“ప్రస్తుత వ్యవస్థలపై అమెరికాకు ఎక్కడా న్యాయం జరగలేదు. అందుకే, ఏప్రిల్‌ 2 నుంచి ఆయా దేశాలపై మనం కూడా ప్రతీకార సుంకాలు విధిస్తాం. వాళ్లు ఎంత విధిస్తే మనమూ అంతే వసూలు చేస్తాం. వీటి వల్ల అమెరికా మరింత సంపన్నంగా మారుతుంది. గొప్ప దేశంగా మళ్లీ అవతరిస్తుంది? అని ట్రంప్‌ స్పష్టం చేశారు. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్లీ తిరిగొచ్చిందని ట్రంప్‌ పేర్కొన్నారు. జనవరి 20న బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గత ఆరు వారాల్లో 100 ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకాలు చేశానని తెలిపారు. మరో 400 కార్యనిర్వాహక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 

 
ఈ ఎన్నికల్లో తన గెలుపు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొందని, దశాబ్దాల్లో ఎన్నడూ చూడని విజయమని చెప్పారు. అమెరికాకు పాత రోజులు తిరిగొచ్చాయని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.  ఉక్రెయిన్‌, రష్యా మధ్య నెలకొన్న బుద్ధిలేని యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, లక్షలాది మంది అనవసరంగా చనిపోయారని ట్రంప్ తెలిపారు.  ఖనిజవనరుల ఒప్పందంపై సంతకం చేసేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సిద్ధంగా ఉన్నారని వివరించారు.
పనామా కెనాల్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్‌, అమెరికా అంతర్గత భద్రతకు గ్రీన్‌ల్యాండ్‌ అవసరమని తేల్చి చెప్పారు. అమెరికాలో అక్రమ వలసలు, ఓపెన్‌ బార్డర్‌ విధానాన్ని నిర్మూలిస్తున్నామని, మెరిట్‌ ఆధారిత నియామకాలను మాత్రమే ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. గ్రీన్‌కార్డు కన్నా గోల్డ్‌ కార్డు విధానం అమెరికాకు మేలు చేస్తుందని తెలిపారు. అమెరికాలో లింగమార్పిడి ఆపరేషన్‌లను క్రిమినలైజ్‌ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.