
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం ఒక జుగుప్సాకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఎమ్మెల్యే సమావేశాలు జరుగుతుండగానే పాన్ మసాలా నమిలి హాల్లోనే ఉమ్మేశాడు. లంచ్ విరామం సమయంలో అది గమనించిన స్పీకర్ సతీష్ మహానా సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు.
లంచ్ తర్వాత సెషన్ ప్రారంభమవగానే ఉమ్మివేసిన ఘటనపై సీరియస్‌గా స్పందించారు. సెషన్ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సతీష్ మహానా సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ “ఈ ఉదయం విధాన సభ హాల్‌లో జరిగిన ఓ ఘటన గురించి మీకు చెప్పాలి. సభ్యుల్లో ఒకాయన పాన్ మసాలా నమిలి ఉమ్మేశారు. విషయం తెలియగానే నేనే స్వయంగా వెళ్లి అక్కడ శుభ్రం చేశా” అని ప్రకటించారు.
సభ్యులు సభా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. అసెంబ్లీ హాల్లో ఉమ్మివేసిన ఎమ్మెల్యే ఎవరో తనకు తెలుసని, వీడియోలో చూశానని చెప్పారు. ఆ ఎమ్మెల్యే తనకు తానుగా తన దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వాలని, లేదంటే తానే తన ఛాంబర్‌కు పిలువాల్సి ఉంటుందని హెచ్చరించారు. సభలో మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
“ఆ ఎమ్మెల్యే ఎవరనేది ఆ వీడియోలో నేను చూశా. కానీ, నేను పేరు చెప్పి ఒక గౌరవ సభ్యుడి పరువు తీయాలని అనుకోవడం లేదు. తనంతట తానుగా ఆయన నా దగ్గరకు వచ్చి వివరణ ఇచ్చుకుంటే మంచిది. లేకుంటే నేనే పిలవాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన అందరికీ ఒక విజ్ఞప్తి చేశారు. ‘ఇక నుంచి ఎవరైనా అలా చేయడం గమనిస్తే వెంటనే అడ్డుకోండి. అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత’ అని చెప్పారు. అయితే అసెంబ్లీ హాల్‌లో ఎమ్మెల్యే ఉమ్మేసిన చోటుకు స్పీకర్ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సభలో ఇలా చేయడం ఏమిటని నెటిజన్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
More Stories
దసరా, దీపావళి కానుక- ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు
బ్రిటిష్, నిజాంల చేతుల్లో నష్టపోయిన ఆర్ఎస్ఎస్
‘శుక్రాచార్య’గా అక్షయ్ ఖన్నా