
జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన సోదరుడు కొణిదెల నాగబాబు పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఖరారు చేసిన్నట్లు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన జారీ చేసింది.
సాధారణ ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి ఇచ్చారు. పొత్తు కోసం సీటును త్యాగం చేశారు. ఆ తర్వాత రాజ్యసభ సీటు వస్తుందనే ప్రచారం జరిగింది. అందులో సీట్లు తక్కువగా ఉండటంతో ఎమ్మెల్సీగా అవకాశం ఇద్దామని సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. గత రాజ్యసభ ఉపఎన్నికల సందర్భంగా ఆయనను మంత్రివర్గంలో చేర్చుకొంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారం జరగడాన్న గమనించిన జనసేన ఆయనకు రాజ్యసభకు పంపాలని భావించారు.
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో నాగబాబును పంపించాలని అనుకునున్నప్పటికీ ఆ స్థానాన్ని ఖాళీ చేయించింది బీజేపీ కాబట్టి ఆ స్థానాన్ని కమలం పార్టీకి వదలాలి అనే సూచనలు కూడా వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం ఉదయం సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం