ఔరంగజేబ్‌పై ప్రేమ ఉంటే ఇళ్లలో సమాధులు కట్టుకోండి

ఔరంగజేబ్‌పై ప్రేమ ఉంటే ఇళ్లలో సమాధులు కట్టుకోండి
ఔరంగజేబ్‌ ను ప్రేమించే వాళ్లు ఆయన సమాధిని ఇళ్లలో కట్టుకోవాలని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ నవనీత్‌ రాణా మండిపడ్డారు. ఔరంగజేబ్‌ను పొగుడుతూ ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
‘నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టిన రాష్ట్రాన్ని ఛత్రపతి శివాజీ మహరాజ్‌, శంభాజీ మహరాజ్‌ పాలించారు. చరిత్ర తెలియని నీలాంటి వాళ్లు తప్పకుండా ‘ఛావా’ సినిమా చూడాలి. అప్పుడు మన రాజుపట్ల ఔరంగజేబ్‌ ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డాడో తెలుస్తుంది’ అంటూ అబూ అజ్మీపై ఆమె మాటల దాడి చేశారు. 
 
అంతేగాక, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నగరం పేరును మార్చి శంభాజీ మహరాజ్‌ పేరు పెట్టాలని నవనీత్‌ రాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఔరంగజేబ్‌ సమాధిని కూల్చివేయాలని కూడా ఆమె డిమాండ్‌ వినిపించారు. ఔరంగజేబ్‌ను ప్రేమించే వాళ్లు ఆయన సమాధిని వారివారి ఇళ్లలో నిర్మించుకోవాలని ఆమె సూచించారు. 
 
అబూ అజ్మీ సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఔరంగజేబ్‌ క్రూరుడు కాదని, ఆయన ఎన్నో ఆలయాలు కట్టించాడని చెప్పారు. అజ్మీ వ్యాఖ్యలను నవనీత్‌ రాణాతోపాటు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే తప్పుపట్టారు. అబూ అజ్మీ క్షమాపణలు చెప్పాలని, లేదంటే ప్రభుత్వం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. 
 
ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ను ఔరంగజేబ్‌ చిత్రహింసలకు గురిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఔరంగజేబ్‌ నాడు శంభాజీ మహారాజ్‌ను 40 రోజులు బంధించి గోళ్లు పీకించాడని, కనుగుడ్లు పెకిలించాడని, చర్మం వలిపించాడని, నాలుక కత్తిరించాడని షిండే చెప్పారు.