నీ తండ్రిని నాయకుడిని చేసిందే నేనే

నీ తండ్రిని నాయకుడిని చేసిందే నేనే

* బీహార్‌ అసెంబ్లీలో నితీష్, తేజస్వి మాటల యుద్ధం

బీహార్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సీఎం నితీశ్‌ కుమార్‌ మాటిమాటికి 2005కు ముందు బీహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పాలన గురించి విమర్శలు చేస్తుండటాన్ని తేజస్వి యాదవ్‌ తప్పుపట్టారు. 2005కు ముందు బీహార్‌లో ఏముంది.? అని నితీశ్‌ ప్రశ్నించడంపై తేజస్వి మండిపడ్డారు. 2005కు ముందు బీహార్‌ రాష్ట్రమే లేదా? అని ఎదురు ప్రశ్నించారు. 
 
ఈ సందర్భంగా సీఎం నితీశ్‌ స్పందిస్తూ ‘2005కు ముందు బీహార్‌లో ఏముంది? నీ తండ్రిని నాయకుడిని చేసిన నేను ఉన్నా. మీ సొంత జాట్‌ వర్గీయులు కూడా లాలూను ఎందుకు నాయకుడిని చేశావని అడుగుతున్నారు. కానీ నేను ఇప్పటికీ నీ తండ్రిని సపోర్టు చేస్తున్నా’ అని చెప్పారు.  అనంతరం తేజస్వి మాట్లాడుతూ.. సీఎం నితీశ్‌ కుమార్‌ తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 2005కు ముందు పాలన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీహర్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ 2005కు ముందు బీహార్‌లోనే ఇంజినీరింగ్‌ డిగ్రీ చేశారని గుర్తుచేశారు. 
 
2005 కంటే ముందే బీహార్‌ నుంచి ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రి అయ్యారని చెప్పారు. ఇప్పుడు చర్చ జరుగుతున్న అసెంబ్లీ భవనం కూడా 2005 కంటే ముందు నిర్మించిందే అని చెప్పారు. బీహార్‌లో అన్నీ నితీశ్‌ కుమార్‌ సీఎం అయిన తర్వాతనే అందుబాటులోకి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నితీశ్‌ సర్కారు ఇంకో 40 ఏండ్లు పాలించినా 2005కు ముందు ప్రభుత్వాన్ని నిందించేలా ఉందని వ్యాఖ్యానించారు.

గతంలో బీహార్‌లో అభివృద్ధి ఏమీ జరగలేదని, తన హయాంలోనే జరిగిందని పేర్కొంటూ ఈ సందర్భంగా తన వల్లే లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో ఎదిగారని నితీష్ వ్యాఖ్యానించారు. 

“గతంలో బీహార్‌లో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? సాయంత్రం అయ్యిందంటే ఎవ్వరూ బయటకు వచ్చేవారు కాదు. నీవు చిన్నపిల్లాడివి. వెళ్లి ప్రజలను అడుగు. మీ నాన్న ఈ స్థాయిలో ఉన్నాడంటే అది నావల్లే. లాలూకు ఎందుకు అండగా నిలుస్తున్నారని మీ సొంత మనుషులే అడిగారు. అయినప్పటికీ మద్దతు ఇచ్చా” అని నీతీశ్ కుమార్ తెలిపారు. 

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన తేజస్వి యాదవ్, రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడారు. ఆదాయం లేనప్పటికీ బడ్జెట్ పెరుగుతూ పోతుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అబద్ధాల పుట్ట అని ఆరోపించారు.  తన తండ్రి లాలూ ప్రసాద్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వంలో మాత్రం అన్నీ తప్పుడు లెక్కలేనని, విమర్శించారు. ముఖ్యమంత్రి నీతీశ్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సమయంలో తేజస్వీ అడ్డుకునే ప్రయత్నం చేయగా, తేజస్వీపై సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.