పీయూష్ గోయల్ ఆకస్మిక అమెరికా పర్యటన!

పీయూష్ గోయల్ ఆకస్మిక అమెరికా పర్యటన!

భారత్‌పై పరస్పర సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సోమవారం తన కార్యక్రమాలన్నిటనీ రద్దు చేసుకొని ఆకస్మికంగా అమెరికాకు బయలుదేరారు. మార్చి  8 వరకు ఆయన అక్కడే ఉండి అమెరికా అధికారులతో అత్యవసర వాణిజ్య చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ప్రతిపాదించిన సుంకాల గురించి ఆ దేశాన్ని స్పష్టత కోరడం. వాటివల్ల దేశంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడం వంటి విషయాలతో సహా సుంకాల తగ్గింపు \, ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపర్చడానికి రూపొందించిన వాణిజ్య ఒప్పందంపై చర్చలు వంటి వాటిపై కేంద్ర మంత్రి దృష్టి పెట్టినట్టు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. 

“భారత్ ఆటోమొబైల్స్, రసాయనాలు వంటి పారిశ్రామిక వస్తువులపై సుంకాలను తగ్గించడానికి అమెరికాతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంది. అయితే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని అమెరికా చేస్తున్న ఒత్తిడికి ఏమాత్రం లొంగేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గిస్తే దేశం లోని రైతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి” అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. హైఎండ్ మోటార్ సైకిళ్లపై సుంకాలు 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించింది. బోర్బన్ విస్కీ టారిఫ్‌లను 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించింది. ఇతర టారిఫ్‌లను సమీక్షిస్తామని, ఇంధన దిగుమతులను పెంచడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది.

అమెరికా నుంచి మరిన్ని రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. అమెరికా భారత్‌పై విధించే పరస్పర టారిఫ్‌ల వల్ల భారత దేశానికి సంవత్సరానికి 7 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లుతుందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక సైతం వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటనలో ఇరు దేశాధినేతలు దౌత్య, వాణిజ్య, రక్షణ సంబంధాలపై చర్చలు జరిపారు. 

ఈ నేపథ్యంలో టారిఫ్‌ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రధాని నరేంద్ర మోదీతో స్వయంగా ట్రంప్ చెప్పారు. అమెరికా నుంచి చేసుకొనే దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు వేస్తోందని, ఇకపై తామూ అదే రీతిలో వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.