పార్టీ నుంచి మేనల్లుడిని బహిష్కరించిన మాయావతి

పార్టీ నుంచి మేనల్లుడిని బహిష్కరించిన మాయావతి

బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి పార్టీ ప్రయోజనాలు, ఉద్యమం దృష్టా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించానని సోమవారం ప్రకటించారు. ఆకాశ్ ఆనంద్‌ను అన్ని పదవులలో నుంచి తప్పించిన మరునాడే ఆయనపై మాయావతి ఈ చర్య తీసుకోవడం గమనార్హం. 

డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో కాన్షీరాం క్రమశిక్షణా సంప్రదాయానికి అనుగుణంగా ఆకాశ్ ఆనంద్‌ను ఆయన మామగారిని బహిష్కరించినట్టే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు మాయవతి తెలిపారు.‘పార్టీ ప్రయోజనాలు, ఉద్యమం దృష్టా తన మావగారి వలె ఆకాశ్ ఆనంద్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించడమైంది’ అని మాయావతి ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో తెలియజేశారు. 

బిఎస్‌పి సంస్థాగత బలాన్ని దెబ్బ తీసిన వర్గాలను సృష్టించడం ద్వారా పార్టీలో అంతర్గతంగా చీలికలు తెస్తున్నారని ఆరోపిస్తూ ఆకాశ్ ఆనంద్ మావగారు అశోక్ సిద్ధార్థ్‌ను మాయావతి ఇంతకు ముందు పార్టీలో నుంచి బహిష్కరించారు. అశోక్ సిద్ధార్థ్ కుమారుని వివాహం సందర్భంలో నిర్వహించిన కార్యక్రమాలు సహా ఇటీవలి సంఘటనలను పార్టీని కించపరిచేందుకు ఆయన యత్నాలకు ఉదాహరణలుగా ఆమె ఉటంకించారు. ఇ

ది ఆమోదయోగ్యం కాదని, ఈ కారణంగానే ఆయనను బహిష్కరించడమైందని ఆమె తెలిపారు.  ఆకాశ్ ఆనంద్‌పై ఆయన మావగారి ప్రభావం రీత్యా ఆయనను పదవుల్లో నుంచి తొలగించడం, బహిష్కరించడం తప్పనిసరి అయిందని మాయావతి వివరించారు. అశోక్ సిద్ధార్థ్ చర్యలు ఇప్పటికే ఆనంద్ రాజకీయ దృక్పథాన్ని పార్టీ అత్యుత్తమ ప్రయోజనాలకు విరుద్ధమైన రీతిలో ప్రభావితం చేయసాగాయని మాయావతి పేర్కొన్నారు.

దీనికి ముందు ఆదివారంనాడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ మాయావతి వరుస ట్వీట్లు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ఆకాశ్ ఆనంద్ మామ అశోక్ సిద్ధార్థ్ నుంచ పార్టీ నుంచి బహిష్కరించామని పేర్కొన్నారు. దీనిపై ఆకాశ్ ఆనంద్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడని భావించినా అతను రాజకీయ అపరిపక్వత చూపించారని ఆమె విమర్శించారు. 

ఆకాశ్ వివరణ చాలావరకూ తన మామ ప్రభావంతో, అహంకారపూరితంగా ఉందని చెప్పారు. ఇది పార్టీ లక్ష్యాలకు విరుద్దమని మాయావతి చెప్పారు. ఇలాంటి వారు ఇంకా ఉంటే పార్టీ నుంచి తప్పుకోవచ్చని సూచించారు. పార్టీ పదవుల నుంచి తొలగించిన అనంతరం అశోక్ ఆనంద్ మాట్లాడుతూ, పార్టీ పదవుల నుంచి తొలగించడం భావోద్వాగానికి గురి చేసిందని తెలిపారు.

”ఇదొక పెద్ద సవాలు. పరీక్ష కష్టం, పోరాటం సుదీర్ఘం” అని పేర్కొన్నారు. త్యాగం, విధేయత, అంకితభావం వంటి పాఠాలను మాయావతి నాయకత్వంలో తాను నేర్చుకున్నానని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు ఒక ఐడియా కాదని, జీవనవిధానమని చెప్పారు. మాయవతి తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని, గౌరవిస్తామని స్పష్టం చేశారు. బీఎస్‌పీ నిజమైన కార్యకర్తగా పార్టీ కోసం, సమాజ హక్కుల కోసం పారాడతానని తెలిపారు.