మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా
 
* సర్పంచ్ హత్య కేసులో రాజకీయ ప్రకంపనాలు
 
మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో సర్పంచ్‌ దారుణ హత్య వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్‌ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సర్పంచ్‌ సంతోష్‌ దేశ్‌ముఖ్‌ హత్య కేసు విషయంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్‌ ముండేను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆదేశించగా, తన రాజీనామాను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 
 
దీనిపై స్పందించిన ఫడణవీస్, ముండే రాజీనామాను ఆమోదించి, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపినట్లు తెలిపారు.  ఎన్​సీపీ అజిత్‌ పవార్‌ వర్గంలోని కీలక నేత అయిన ధనంజయ్‌ ముండే సొంత జిల్లా బీడ్‌లోని మసాజోగ్‌ గ్రామ సర్పంచ్‌ సంతోష్‌ దేశ్‌ముఖ్‌ ఇటీవల హత్యకు గురయ్యారు. ఆయనను కిడ్నాప్‌ చేసి, చిత్రహింసలకు గురి చేసి దారుణంగా హత్య చేశారు. 
 
ఈ కేసును విచారించిన సీఐడీ, వాల్మీక్‌ కరాడ్‌ను నిందితుడిగా తేల్చింది. అతడిపై 1200 పేజీల అభియోగపత్రం దాఖలు చేసింది. సర్పంచ్‌ను హింసించి హత్య చేసినట్లు అందులో పేర్కొంది. నిందితుడు వాల్మీక్‌ కరాడ్‌, ధనంజయ ముండేకు అత్యంత సన్నిహితుడు. ఫలితంగా పౌరసరఫరాల శాఖను నిర్వహిస్తున్న ధనంజయను పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి.
 
ఈ ఘటన రాజకీయంగానూ వేడి పుట్టించింది. ఈ క్రమంలో ధనంజయ్‌పై ప్రతిపక్షాలతో పాటు పలువురు మహాయుతి నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు. దర్యాప్తు అధికారులు, స్థానిక రాజకీయ నేతలు కుమ్మక్కయ్యారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేతలు ఆరోపిస్తున్నారు. దర్యాప్తులో పారదర్శకత కొరవడిందని, మంత్రి ముండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్‌ మంత్రి ధనంజయ్‌ను రాజీనామా చేయమని కోరినట్లు తెలుస్తోంది

మరోవైపు, మంత్రి ధనంజయ్‌ ముండేకు గట్టి మద్దతు ఇస్తున్న ఎన్​సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌కు, మంత్రికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను తాను సమర్పించినట్లు సామాజిక కార్యకర్త అంజలి దమానియా పేర్కొన్నారు. దీంతో ధనంజయ్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు మళ్లీ మొదలయ్యాయి. 

ఎన్​సీపీ (శరద్‌ పవార్‌) కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే సైతం ధనంజయ్‌ ముండే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ధనంజయ్‌ మాట్లాడుతూ, తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ లేదా ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ చెప్తే వెంటనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. 

దీనిపై ఉప ముఖ్యమంత్రి, ఎన్​సీపీ అధినేత ఏక్‌నాథ్‌ శిందేతో చర్చలు జరిపిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామా చేయాలని ధనంజయకు స్పష్టం చేసినట్లు సమాచారం. ధనంజయ పదవికి రాజీనామా చేయగా దాన్ని ముఖ్యమంత్రి ఫడణవీస్‌ ఆమోదించారు.