విశ్వసనీయ భాగస్వామిగా భారత్

విశ్వసనీయ భాగస్వామిగా భారత్

నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయగల విశ్వసనీయ భాగస్వామిగా భారత్ వైపు ప్రపంచం చూస్తున్న తరుణంలో భారతీయ పరిశ్రమ రంగం ప్రపంచ అవకాశాల సద్వినియోగానికి ‘భారీ చర్యలు’ తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కోరారు. 

‘నియంత్రణ, పెట్టుబడి, వ్యాపార సంస్కరణలు, నిర్వహణలో సౌలభ్యం’ అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్‌లో ప్రధాని ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితుల వల్ల ఏర్పడిన సప్టై చైన్ అంతరాయాల నడుమ ప్రపంచానికి ఇప్పుడు అధిక నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయగల, ఆధారపడదగిన సప్లై చైన్ ఉన్న విశ్వసనీయ భాగస్వామి అవసరం ఉన్నదని చెప్పారు.

‘మన దేశానికి ఈ పని చేయగల సత్తా ఉంది, మీ అందరూ (పరిశ్రమ) సత్తా ఉన్నవారు, ఇది మనకు మహత్తర అవకాశం. ప్రపంచం అంచనాలను కేవలం ఒక వీక్షకునిగా మన పరిశ్రమ చూడరాదని కోరుకుంటున్నా. మనం వీక్షకులుగా ఉండిపోరాదు. దీనిలో మీకు పాత్ర ఉందని మీరు గ్రహించవలసి ఉంటుంది, మీ కోసం అవకాశాలను మీరు కోరుకోవలసి ఉంటుంది’ అని ప్రధాని మోదీ పారిశ్రామిక అధిపతులతో చెప్పారు. 

ప్రభుత్వం గడచిన పది సంవత్సరాలుగా పరిశ్రమతో కలసి పని చేస్తున్నదని, సంస్కరణలు చేపట్టడానికి, ఆర్థిక క్రమశిక్షణకు, పారదర్శకతకు. సమ్మిళిత వృద్ధికి తన నిబద్ధతను ప్రదర్శించిందని ప్రధాని తెలియజేశారు. ఇప్పుడు భారత్ ప్రపంచానికి వృద్ధి మార్గదర్శక దేశం. సంక్లిష్ట సమయాల్లో ధీరచిత్తంతో ఉండగలనని భారత్ నిరూపించిందని చెప్పారు. 

ప్రస్తుతం ప్రతి దేశంభారత్‌తో తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేయాలని వాంఛిస్తోందని పేర్కొంటూ మన ఉత్పత్తి రంగం ఈ భాగస్వామ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోదీ పిలుపిచ్చారు. ప్రభుత్వ నిలకడ, సంస్కరణలకు హామీ కారణంగా పరిశ్రమ నూతన ఆత్మ విశ్వాసం పొందిందని ఆయన చెప్పారు.