
దృష్టి లోపం ఉన్న అభ్యర్థులకు జ్యుడీషియల్ సర్వీస్‌ల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండరాదని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సంచలనాత్మకమై న తీర్పు వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో అలాంటి అభ్యర్థులకు జ్యుడీషియల్ సర్వీస్‌లో ఉద్యోగాలు కల్పించడం లేదని పేర్కొంటూ దాఖలైన ఆరు పిటిషన్లపై జస్టిస్ జెబి పార్ధివాలా, జస్టిస్ ఆర్. మ హదేవన్‌తో కూడిన ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 3న తీర్పు రిజర్వు చేసింది.
సోమవారం ఈ తీర్పును బయటపెట్టింది. దీనిపై జస్టిస్ మహదేవన్ మాట్లాడుతూ అలాంటి దృష్టి లోపం ఉన్న అభ్యర్థులపై జ్యుడిషియల్ సర్వీస్‌లో ఉద్యోగాలు కల్పించే విషయంలో ఎలాంటి వివక్ష చూపించరాదని స్పష్టం చేశారు. వారిని ఆయా జ్యుడిషియ ల్ సర్వీసులో కలుపుకోవడానికి తగినట్టుగా ఆయా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
దివ్యాంగులు ఎవరైనా సరే అభ్యర్థులుగా ఉన్నప్పుడు వారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని చెప్పారు. దృష్టి లోపం లేదా మాంద్యం ఉన్న వారిని జ్యుడీషియల్ సర్వీస్‌లో తీసుకోవడానికి వీలులేదని మధ్యప్రదేశ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (రిక్రూట్ మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ ) రూల్స్ 1994ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ కారణంగా అంధుడైన తన కుమారుడు పరీక్ష రాయలేకపోయాడని పేర్కొంటూ ఆయన తల్లి అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు లేఖ రాశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆ రూల్ వివక్షాపూరితంగా ఉందని పేర్కొంటూ కొట్టివేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం- 2016లోని నిబంధనల ప్రకారం అలాంటి వ్యక్తులకు తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.
జడ్జీల పదవులకు అంధులు అర్హులేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ మేరకు రాజస్థాన్, తమిళనాడుల్లో నియామకాలు జరిగాయి. ఈ తీర్పు వల్ల దివ్యాంగులు ఎవరైనా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో పాల్గొంటే జ్యుడీషియల్ సర్వీస్ లోకి అనుమతించడానికి వీలవుతుంది. వారు ఇతరత్రా అర్హులైతే వారిని ఉద్యోగాల ఖాళీల్లో నియమించవచ్చని తీర్పులో వెల్లడించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్