ఎయిర్‌పోర్ట్స్‌లో టీ రూ. 10, కాఫీ రూ 20

ఎయిర్‌పోర్ట్స్‌లో టీ రూ. 10, కాఫీ రూ 20
విమాన ప్రయాణం అనగానే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనే భావన సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా విమానాశ్రయాలలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి. ఒక కప్పు టీ, చిన్న స్నాక్ కోసం కూడా వందల రూపాయలు వెచ్చించాల్సిందే.  కానీ, ఈ పరిస్థితికి తెరదించుతూ భారత ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది.
“ఉడాన్ యాత్రి కేఫ్‌లు” పేరుతో విమానాశ్రయాలలో చౌక ధరలకే ఆహారాన్ని అందించే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇటీవల చెన్నై విమానాశ్రయంలో రెండవ “ఉడాన్ యాత్రి కేఫ్”ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
కేవలం రూ.10కే వాటర్ బాటిల్ లేదా టీ, రూ.20లకే కాఫీ లేదా స్నాక్స్ అందిస్తూ, ఏ ప్రయాణికుడూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ కేఫ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాఫీ, సమోసా, వడ, స్వీట్ రూ 20 చొప్పున ధరలకే లభిస్తున్నాయి.  ఇప్పటికే కోల్‌కతా విమానాశ్రయంలో ప్రారంభమైన “ఉడాన్ యాత్రి కేఫ్” విజయవంతంగా నడుస్తోందని, ప్రయాణికులు నాణ్యత, రుచి, ధరల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు.

ప్రయాణికుల నుంచి లభిస్తున్న విశేష స్పందన దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలు విమాన ప్రయాణాలకు మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరుణంలో, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
చెన్నై విమానాశ్రయం సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. టెర్మినల్ 2 ఫేజ్ 2 నిర్మాణ పనులు పూర్తయితే, విమానాశ్రయం వార్షిక సామర్థ్యం 22 మిలియన్ల నుంచి 35 మిలియన్లకు పెరుగుతుందని ఆయన వివరించారు.  అంతర్జాతీయ కార్యకలాపాలను మెరుగుపరచడానికి టెర్మినల్ 2 విస్తరణ 86,135 చదరపు మీటర్లలో జరుగుతోందని తెలిపారు. అంతేకాకుండా, టెర్మినల్స్ 1, 4 పునరుద్ధరణ పనులు రూ.75 కోట్లకు పైగా పెట్టుబడితో జరుగుతున్నాయని వెల్లడించారు.