15 ఏళ్లు దాటిన వాహనాలకు ఢిల్లీలో పెట్రోల్ బంద్

15 ఏళ్లు దాటిన వాహనాలకు ఢిల్లీలో పెట్రోల్ బంద్

దేశ రాజధానిలో కాలుష్యం కట్టడికి ఢిల్లీలోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన అంటే 15 ఏళ్ల పైబడిన వాహనాలకు పెట్రోల్‌ బంకులలో ఇంధనం పోయొద్దని నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీ నుంచి తాజా నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా శనివారం ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. వాహన కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పాత వాహనాలపై ఆంక్షలు విధించడం, తప్పనిసరి యాంటీ స్మోగ్ చర్యలు చేపట్టడం, దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సిర్సా తెలిపారు. 

పెట్రోల్ పంపుల వద్ద ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లు ఏర్పాటు చేస్తామని, వాటి సాయంతో 15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తిస్తామని అన్నారు. అలాంటి వాహనాలకు ఇంధన సరఫరా ఆపేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖకు కూడా తెలియజేశామని చెప్పారు. 

ఇంధనం సరఫరా ఆంక్షలతోపాటు, ఢిల్లీలోని బహుళ అంతస్తుల భవనాలు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు తప్పనిసరిగా యాంటీ స్మోగ్ గన్లను అమర్చాలనే నిర్ణయం కూడా చేశామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా సుమారు 90 శాతం సీఎన్‌జీ బస్సులను దశల వారీగా ఉపసంహరించుకుని ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయనున్నట్టు చెప్పారు.