కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో ప్రణాళిక మొదలుకొని నిర్వహణ వరకు పలు లోపాలను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) గుర్తించింది. ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలని తెలియజేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఈ బ్లాకును మళ్లీ నిర్మించేందుకు అవసరమైన డిజైన్‌ను రూపొందించే బాధ్యతను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) అప్పగించాలని సూచించినట్లు తెలుస్తుంది. బ్యారేజీ లోపాలను గుర్తించిన ఎన్డీఎస్‌ఏ : కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ రెండు వారాల క్రితం నివేదికను అందజేయగా, దీనిపై మూడ్రోజుల క్రితం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ చర్చించినట్లు సమాచారం.
ఎన్డీఎస్‌ఏ, జలసంఘం, జల్‌శక్తి అధికారులకు చంద్రశేఖర్ అయ్యర్ నివేదికలోని ముఖ్యాంశాల గురించి ప్రజంటేషన్ ద్వారా వివరించినట్లు తెలిసింది. ఈ నివేదికను తదుపరి కార్యాచరణకు ఎన్డీఎస్‌ఏ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు కొన్ని పియర్స్ దెబ్బతిన్నాయి.
ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ పరిశీలించి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో వైఫల్యాల వల్ల దెబ్బతిన్నట్లు నివేదించింది. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 2024 మార్చి 2న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఎన్డీఎస్‌ఏ నియమించింది.
బ్యారేజీని అధ్యయనం చేసి వాటి పరిస్థితిని అంచనా వేసి ఏయే చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయాలని తెలిపింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లను కూడా అధ్యయనంలో చేర్చింది. ఈ కమిటీ గత ఏడాది మే1న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. బ్యారేజీలలో నీటిని నిల్వ ఉంచకుండా గేట్లు తెరిచి ఉంచాలని, పలు పరీక్షలు చేయించాలని తెలిపింది.
మేడిగడ్డకు సంబంధించి పరీక్షలన్నీ పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత పలు సిఫార్సులతో తుది నివేదిక ఇచ్చింది. బ్యారేజీల పరిస్థితి, వైఫల్యాలకు కారణాలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ నివేదికలో పొందుపరిచినట్లు సంబంధిత వర్గాల సమాచారం. డిజైన్, నిర్మాణం, నిర్వహణ, నాణ్యత తనిఖీలో లోపాలున్నాయని తెలిపారు. మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను తొలగించి మళ్లీ నిర్మించాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి