మంచుచరియల్లో చిక్కుకుని నలుగురు మృతి

మంచుచరియల్లో చిక్కుకుని నలుగురు మృతి

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మనా గ్రామంలో హిమపాతం కారణంగా మంచు చరియల కింద చిక్కుకున్న కార్మికుల్లో 50 మందిని రక్షించారు. వారిలో నలుగురు చనిపోయారు. మిగతా ఐదుగురు కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు భారత ఆర్మీ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. 

కార్మికులను రక్షించే ఆపరేషన్ కోసం ఆర్మీకి చెందిన మూడు హెలికాప్టర్లు, వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు, ఒక అద్దె హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆర్మీ సెంట్రల్ కమాండ్ జీఓసీ, లెఫ్టినెంట్ జనరల్ అనింద్యా సేన్ గుప్తా , ఆర్మీ ఉత్తర భారత్ ఏరియా జీఓసీ, లెఫ్టినెంట్ జనరల్ డీజీ మిశ్ర ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చమోలిలో పర్యటించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలను పరిశీలించారు.

”బద్రీనాథ్‌కు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే మనా గ్రామం ఉంది. ఇది భారత్-టిబెట్ సరిహద్దుల్లో 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. మంచు చరియలు విరిగి ఈ ఊరిలోని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) శిబిరంపై పడ్డాయి.  ఇక్కడొక చోటే కాదు బద్రీనాథ్-జోషిమఠ్ హైవేపై దాదాపు 15 నుంచి 20 చోట్ల మంచు వల్ల రహదారి స్తంభించింది” అని లెఫ్టినెంట్ జనరల్ అనింద్యా సేన్ గుప్తా చెప్పారు. 

”మంచుచరియలు విరిగిపడినప్పుడు మనా గ్రామంలోని బీఆర్ఓ శిబిరంలో మొత్తం 8 కంటైనర్లు ఉన్నాయి. మంచు చరియల కింద కూరుకుపోయిన ఐదు కంటైనర్లు దొరికాయి. రెస్క్యూ అయిన 50 మంది కార్మికులంతా ఈ ఐదు కంటైనర్లలోని వారే. మరో మూడు కంటైనర్లు దొరకాల్సి ఉంది” అని ఆయన తెలిపారు.

శుక్రవారం తెల్లవారు జామున 5-6 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది.దీంతో 8 కంటైనర్లు, ఓ షెడ్ లో ఉన్న 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు. శుక్రవారం రాత్రి కల్లా 33 మందిని రక్షించారు. మొత్తం మీద ఇప్పటివరకూ 50 మందిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం రాత్రి సమయానికే వీరిలో 33 మందిని రక్షించారు. మరో 17 మందిని శనివారం కాపాడారు.