8 నుంచి మణిపూర్‌లోని అన్ని మార్గాల్లో రాకపోకలు సాగాలి

8 నుంచి మణిపూర్‌లోని అన్ని మార్గాల్లో రాకపోకలు సాగాలి
రెండు తెగల మధ్య వైరంతో రెండేళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్‌ లో శాంతి భద్రతల పరిస్థితిపై శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న మణిపూర్‌లో భద్రతా పరిస్థితులపై ఆయన సమీక్ష జరిపారు. మార్చి 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మార్గాల్లో ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 
 
రాకపోకలను అడ్డుకునే వారిపై, రోడ్ల దిగ్బంధాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు వెంట డిజిగ్నేటెడ్ ఎంట్రీ పాయింట్లకు ఇరువైపులా ఫెన్సింగ్ వర్క్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, మాదకద్రవ్యాల బెడదలేని రాష్ట్రంగా మణిపూర్‌ను తీర్చిదిద్దాలని హోంమంత్రి షా ఆదేశించారు. 
 
మణిపూర్‌లో డ్రగ్ ట్రేడ్ నెట్‌వర్క్‌ను సమూలంగా నిర్మూలించాలని సూచించారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఇందుకు సంబంధించి అవసరమైన సహాయాన్ని అందచేస్తుందని అమిత్‌ షా హామీ ఇచ్చారు. నార్త్ అవెన్యూలో మధ్యాహ్నం 11 గంటలకు జరిగిన ఈ కీలక సమావేశంలో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్మీ, పారామిలిటరీ అధికారులు పాల్గొన్నారు.
కాగా మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం అక్కడి పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగడం ఇదే మొదటిసారి. 2023 మే నెలలో మణిపూర్‌లోని మైతీ, కుకీ తెగల మధ్య తలెత్తిన వైరం తీవ్ర హింసాకాండకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు.
ముఖ్యమంత్రి ఎన్ బీరేన్‌సింగ్ ఇటీవల రాజీనామా చేయడంతో ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు.శాంతిని నెలకొల్పే చర్యల్లో భాగంగా ప్రజలు తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను వారం రోజుల్లోగా అప్పగించాలని మణిపూర్‌ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఇటీవల విజ్ఞప్తి చేశారు. దాంతో వారం రోజుల వ్యవధిలో 300కు పైగా ఆయుధాలను ప్రజలు అప్పగించినట్టు సమాచారం.