
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సీఎం బంగ్లా’ వివాదం ముదరడం, దానిని ‘శేష్ మహల్’ (అద్దాల మేడ)గా అభివర్ణిస్తూ బీజేపీ విరుచుకుపడటం ‘ఆప్’ విజయావకాశాలను గండి కొట్టింది. తాజాగా ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన అధికార నివాసాన్ని ‘శీష్ మహల్’ తరహాలో పునరుద్ధరించుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఓవైపు ప్రజాపనుల కోసం నిధులు లేవంటూ సొంత పనులకు భారీ ఖర్చులు ఎందుకంటూ నిలదీస్తు్న్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార నివాసం ‘కావేరీ’ పునరుద్ధరణకు రూ.2.6 కోట్లను రాష్ట్ర ప్రజాపనుల శాఖ అంచనా వేసింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి జీవో వెలువడింది. బంగ్లా అప్‌గ్రేడేషన్‌లో భాగంగా రూ.1.7 కోట్లతో హెల్పర్ రూమ్‌లు, ఇతర నిర్మాణాలు చెపట్టనుండగా, రూ.89 లక్షలతో ఎలక్ట్రిక్ అప్‌గ్రెడ్, మొదలైన సదపాయాలు కల్పించనున్నారు.
‘ఇండియా టుడే’ కథనం ప్రకారం కావేరి భవనంలో సీఎం కొత్త సహాయకుడి కోసం ఓ ప్రత్యేక గది నిర్మాణం, ఆ గదికి బాత్‌రూమ్, అదనపు స్టోరేజీ రూమ్స్, ర్యాక్‌లు, కిచెన్ సామాను, కొత్త విద్యుత్తు దీపాలు, వాటర్ ట్యాప్‌లు, ఏసీ తదితరాల కోసం మొత్తంగా రూ. 2.6 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ఆర్థిక శాఖ తెలిపింది.
తాజా పరిణామంపై బీజేపీ ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచార్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిధులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి తన సొంత పనులపై దృష్టిసారించడం ఏమిటని ఆయన నిలదీశారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన పనులను ముందు చేపట్టి ఆ తర్వాత సొంత బంగ్లా పనుల చక్కబెట్టుకోవాలని హితవు పలికారు.
సీఎం సొంత ఖర్చులతో తన నివాసానికి అదనపు హంగులు చేయించుకొంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సిద్ధూ సర్కారు.. ప్రజాధనాన్ని అభివృద్ధికి వినియోగించకుండా ఇలా ఆడంబరాలకు ఖర్చు చేయడమేంటని విశ్లేషకులు ధ్వజమెత్తుతున్నారు.
కర్ణాటక ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీఎం బంగ్లాను పునరుద్ధరిస్తారంటూ వార్తలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వ గ్యారెంటీ పథకాలకే నిధుల కొరత ఉందని, ఇక రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమని బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?