వరంగల్ జిల్లాలోని మామూనూర్‌లో విమానాశ్రయం

వరంగల్ జిల్లాలోని మామూనూర్‌లో విమానాశ్రయం

వరంగల్ జిల్లా మామునూరులో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై గత కొంతకాలంగా కొనసాగుతున్న కసరత్తులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మామునూరును విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని గతంలోనే ప్రతిపాదనలు పంపగా, తాజాగా కేంద్రం దీనికి అంగీకారం తెలిపింది. 

రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్ కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కి.మీ పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. జీఎంఆర్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. 

దీంతో మామునూరుకు జీఎంఆర్ అంగీకారం తెలిపింది. జీఎంఆర్ అంగీకారం తెలపడంతో విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్ పోర్ట్ అథారిటీని రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఎయిర్ పోర్టు విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసింది.

ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నేవిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ వెల్లడించింది. 

నిజాం కాలంలో మామునూరు నుంచి వాయుదూత్ విమానాలు నడిచేవి. భారత్, చైనా యుద్ధ సమయంలో కీలక సేవలందించాయి. దాదాపు 32 ఏళ్ల కిందట మూతపడిన మామునూరు విమానాశ్రయానికి మళ్లీ ‘రెక్కలు’ రానున్నాయి. ఈ నిర్ణయంతో వరంగల్ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు మరింత పెరగనున్నాయి. విమాన ప్రయాణాల విస్తరణ, వ్యాపారం, పర్యాటకం అభివృద్ధికి మామునూరు ఎయిర్‌పోర్ట్ కీలకంగా మారనుంది.

ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే తెలంగాణలో మరొక ప్రధాన ఎయిర్‌పోర్ట్ ఏర్పడి, ప్రజలకు మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఈ విమానాశ్ర‌య నిర్మాణానికి పూర్తి స్థాయిలో అనుమ‌తులు రావ‌డం ప‌ట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు