జావెద్‌ అక్తర్‌ కు కంగనా రనౌత్‌ క్షమాపణలు

జావెద్‌ అక్తర్‌ కు కంగనా రనౌత్‌ క్షమాపణలు
ప్రసిద్ధ కవి, సినీ పాటల రచయిత జావెద్‌ అక్తర్‌ కి బాలీవుడ్‌ హీరోయిన్‌, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ క్షమాపణలు చెప్పారు. బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య వ్యవహారంలో అనవసరంగా పేరు ప్రస్తావించి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ 2020లో కంగనాపై జావెద్‌ పరువు నష్టం దావా వేశారు.
 
ఒక సహ నటుడికి క్షమాపణ చెప్పాలంటూ జావెద్‌ 2016లో తనను బెదిరించారని, గౌరవానికి భంగం కలిగించారని కంగన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా వీరిద్దరు రాజీ కుదుర్చుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణకు ఉద్దేశించిన ప్రత్యేక న్యాయస్థానంలో ఈ ఇద్దరు సినీ ప్రముఖులూ శుక్రవారం హాజరై పరస్పర ఫిర్యాదులను ఉపసంహరించుకుంటున్న ట్టు ప్రకటించారు. 
 
న్యాయస్థానం కూడా వీరిద్దరి నిర్ణయానికి అంగీకారం తెలిపింది. ” ఈరోజు నేను, జావెద్‌ న్యాయ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకున్నాం. ఆయన ఎంతో దయతో హుందాగా వ్యవహరించారు. నేను దర్శకత్వం వహించనున్న తదుపరి చిత్రానికి పాటలు రాయడానికి కూడా అంగీకరించారు” అని రనౌత్‌ ప్రకటించారు. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో జావేద్‌ అక్తర్‌తో ఉన్న చిత్రాన్ని కూడా షేర్‌ చేశారు.