
భారతీయ ఉత్పత్తులు విదేశాలకు వెళుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని చాటుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తెలిపారు. తన ‘స్థానికంకోసం ఎలుగెత్తి చాటాలి’ ప్రచారోద్యమం సత్ఫలితాలు సాధిస్తోందని ఆయన చెప్పారు. ఢిల్లీలో ఎన్‌ఎక్స్‌టి కాన్‌క్లేవ్‌లో ప్రధాని మాట్లాడుతూ, భారత్ అపరిమిత సృజనల భూమిగా మారుతోందని, అందుబాటులో పరిష్కారాలు కనుగొంటున్నదని, ప్రపంచానికి వాటిని సూచిస్తోందని తెలిపారు.
ఈ కాన్‌క్లేవ్‌లోనే ‘న్కూస్‌ఎక్స్ వరల్డ్’ చానెల్‌ను ఆవిష్కరించారు. ‘ప్రపంచం 21వశతాబ్దపు భారత్‌ను ఆసక్తితో పరికిస్తున్నది. ప్రపంచం అంతటి నుంచి ప్రజలు భారత్‌ను సందర్శించి అవగాహన చేసుకోవాలని వాంఛిస్తున్నారు’ అని మోదీ చెప్పారు. దేశం ఇప్పుడు తయారీ కేంద్రంగా, ‘ప్రపంచ కార్ఖానా’గా ఆవిర్భవిస్తోందని ప్రధాని వెల్లడించారు.
‘దశాబ్దాలుగా భారత్‌ను తమ పెరటి విభాగంగా ప్రపంచం పరిగణిస్తుండేది. ఇప్పుడు భారత్ ప్రపంచానికి కొత్త కర్మాగారంగా మారుతోంది. మేము ఇక ఎంత మాత్రం శ్రామికశక్తి కాము, కానీ దానికి బదులు ప్రపంచ శక్తిగా మారుతున్నాం’ అని మోదీ చెప్పారు. భారత పెరుగుతున్న రక్షణ ఉత్పత్తులు తమ ఇంజనీరింగ్, సాంకేతిక బలాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయని ప్రధాని ఉద్ఘాటించారు.
‘ఎలక్ట్రానిక్స్ నుంచి ఆటోమోబైల్ రంగం వరకు ప్రపంచం భారత స్థాయిని, సత్తాను తిలకించింది. భారత్ ప్రపంచానికి కేవలం ఉత్పత్తులను సమకూరుస్తుండడమే కాకుండా గ్లోబల్ సప్లయి చైన్‌లో విశ్వసనీయ, ఆధారపడదగిన భాగస్వామిగా మారుతోంది’ అని ప్రధాని చెప్పారు. వివిధ రంగాల్లో భారత నాయకత్వం ఏళ్ల తరబడి కఠిన శ్రమ, వ్యూహాత్మక విధాన నిర్ణయాల ఫలితమని ప్రధాని పేర్కొన్నారు.
దేశం సెమీకండక్టర్లను, విమానవాహక నౌకలను తయారు చేస్తున్నదని, ‘మఖానా’, చిరుధాన్యాలు వంటి సూపర్ ఆహారాలను, ఆయుష్ ఉత్పత్తులను, యోగాను ప్రపంచవ్యాప్తంగా స్వాగతిస్తున్నారని మోదీ తెలియజేశారు. భారత్ ప్రపంచానికి సున్నా సిద్ధాంతాన్ని అందజేసిన భూమి అని, అది ఇప్పుడు అపరిమిత సృజనల భూమిగా మారుతోందని ప్రధాని చెప్పారు.
‘ప్రపంచానికి భద్రమైన, వ్యయనియంత్రిత డిజిటల్ చెల్లింపు వ్యవస్ధ అవసరమైనప్పుడు భారత్ యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)ను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఫ్రాన్స్, యుఎఇ, సింగపూర్ వంటి దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల్లో యుపిఐని మిళితం చేసుకుంటున్నాయి’ అని ఆయన తెలిపారు.
కరోనా మహమ్మారి సమయంలో భారతీయ వ్యాక్సిన్ ప్రపంచానికి దేశ నాణ్యమైన ఆరోగ్య సేవ పరిష్కారాలను ప్రదర్శించిందని ప్రధాని తెలియజేశారు. ఆరోగ్య సేతు యాప్ ప్రపంచ ప్రయోజనార్థం సార్వత్రిక వనరుగా మారిందని మోదీ చెప్పారు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం మూడవ విడత తిరిగి ఎన్నిక కావడం ప్రజల నమ్మకాన్ని ప్రదర్శించిందని ప్రధాని చెప్పారు. భారత్ నుంచి కొత్త ప్రపంచ వార్తా చానెల్ దేశ విజయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుందనే ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!