
ఈ సంవత్సరాంతానికి ఆశావహ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ శుక్రవారం నిర్ణయించారు. రక్షణ, భద్రత, కీలక టెక్నాలజీ రంగాల్లో భారత్, ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఉభయ నేతలు ప్రతిజ్ఞ చేశారు.
వాన్ డెర్ లెయెన్‌తో చర్చల అనంతరం మీడియా ప్రకటన విడుదల చేసిన ప్రధాని మోదీ భారత్, ఇయు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ‘సహజమైనది, సేంద్రీయమైనది’గా, ప్రజాస్వామ్య విలువల్లో ‘విశ్వాసం’పై, ఉమ్మడి భావనపై ఆధారపడినదిగా అభివర్ణించారు.
ఈ సంవత్సరాంతానికి పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవలసిందిగా తమ బృందాలను ఆదేశించామని ఆయన తెలియజేశారు. వాణిజ్యం, టారిఫ్‌లపై ట్రంప్ ప్రభుత్వ విధానంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో తీసుకున్న గణనీయమైన నిర్ణయం ఇది. పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందం, భౌగోళిక సూచిక (జిఐ)లపై ఒప్పందం కోసం సంప్రదింపులపై ముందుకు సాగేందుకు ఉభయ పక్షాలు చూస్తున్నాయని ప్రధాని తెలిపారు.
అనుసంధానతను ప్రధాని ప్రస్తావిస్తూ, భారత, మధ్య ప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ (ఐఎంఇఇసి)ని ముందుకు తీసుకువెళ్లేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. ప్రపంచ వాణిజ్యం, సుస్థిర వృద్ధి, సంపద రంగాల్లో సాగేందుకు ఐఎంఇఇసి కారిడార్ దోహదకారి కాగలదని తాను విశ్వసిస్తున్నట్లు మోదీ తెలిపారు. వాన్ డెర్ లెయెన్, ఇతర కమిషనర్ల బృందం భారత పర్యటన ‘కని విని ఎరగనటువంటిది’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరత, సంపద ప్రాముఖ్యంపై భారత్, ఇయు అంగీకరించినట్లు మోదీ వెల్లడించారు. భారత్, ఇయు భాగస్వామ్యాన్ని పెంచేందుకు, వేగిరపరచేందుకు అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలియజేశారు. భారత్‌తో తమ అనుబంధాన్ని కొత్త పుంతలు తొక్కించాలని ఇయు కోరుకుంటున్నట్లు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు లెయెన్ తెలిపారు.
భారత్‌తో భద్రత, రక్షణ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భావిస్తున్నామని లెయెన్ తెలిపారు. గతంలో తాము ఇలాంటి ఒప్పందాన్ని జపాన్, దక్షిణ కొరియాతో కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. సైనిక సామర్థ్యాలను పెంచుకునే దిశగా భారత్ వేగంగా పురోగమిస్తోందని పేర్కొంటూ ఈ విషయంలో భారత్-ఈయూ పరస్పరం చేదోడును అందించుకోగలవు అని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశానికి ముందు ఆమె ఒక సదస్సులో పాల్గొంటూ “రక్షణ రంగ పారిశ్రామిక ప్రాజెక్టులలో ఈయూతో కలిసి పనిచేసేందుకు భారత్ ఆసక్తిగా ఉందని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. సైనిక సామర్థ్యాలను పెంచుకునే దిశగా భారత్ వేగంగా పురోగమిస్తోంది. ఈ విషయంలో భారత్-ఈయూ పరస్పరం చేదోడును అందించుకోగలవు అని నేను నమ్ముతున్నాను” అని చెప్పారు.
“సీమాంతర ఉగ్రవాదం, సముద్ర జలాల్లో భద్రత, సైబర్ దాడులు, కీలకమైన మౌలిక సదుపాయాలపై ఉగ్ర దాడులు వంటి విషయాల్లో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం” అని ఉర్సులా ప్రకటించారు. “గత 30 ఏళ్లలో భారత్-ఈయూ చాలా విషయాల్లో సంపూర్ణ విశ్వాసంతో పరస్పర సహకారాన్ని అందించుకున్నాయి. ఈ సహకారానికి పరిమితులు విధించుకునే సమయం కాదు ఇది. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా స్పందించాల్సిన సమయం ఇది. మాటలు కాదు కీలకమైన చేతల సమయం ఇది” అని పేర్కొనడం గమనార్హం.
“ఉక్రెయిన్ విషయంలో మేం(ఈయూ) పూర్తి స్పష్టతతో ఉన్నాం. ఉక్రెయిన్ ఒకవేళ ఓడిపోతే, ప్రపంచంలో ఎక్కడైనా అదే తరహా పరిస్థితి పునరావృతమయ్యే ముప్పు ఉంటుంది. అంతర్జాతీయ సరిహద్దును ఉల్లంఘించి పొరుగు దేశంపై దండయాత్ర చేయడం అస్సలు సరికాదు” అని ఆమె స్పష్టం చేశారు.
కాగా, “భారత్ -పశ్చిమాసియా – ఐరోపా రోడ్ కారిడార్‌కు ఈయూ అనుకూలమే” అని ఈయూ చీఫ్ వెల్లడించారు. భారత్, ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్‌తో యూరోపియన్ వాణిజ్య, ఆర్థిక భద్రతా విభాగం కమిషనర్ మారోస్ సెఫ్కోవిక్ ఢిల్లీలో చర్చించారు. ఈ సమావేశం వివరాలతో పీయూష్ గోయల్ ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేశారు. ‘
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ముడిపడిన కీలక అంశాలపై చర్చించేందుకు భారత్, ఈయూకు చెందిన సీనియర్ అధికారులు మార్చి 10 నుంచి 14 వరకు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో భేటీ కానున్నారు. ఇరు పక్షాల అధికారులు ఈ అంశంపై సమావేశం కావడం ఇది పదోసారి.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం