పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్

పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్
రచయిత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీకు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి అరెస్టు చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె పోలీస్టేషన్‌‌కు తరలించారు. 8 గంటల విచారించిన పోలీసులు పోసానికి వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం రాత్రి 9.30 గంటలకు రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. 
 
శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఎన్‌ఎస్‌ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్‌ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. కాగా పోసానికి రిమాండ్‌ విధించాలని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న మేజిస్ట్రేట్‌ పోసానికి 14 రోజుల వరకు రిమాండ్‌ విధిస్తూ తీర్పునిచ్చారు. 
 
మార్చి 12వ తేదీ వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. దీంతో పోసానిని కడప కేంద్రకారాగానికి తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.  అంతకు ముందు, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పర్యవేక్షణలో పోసానిని 8 గంటలపాటు విచారించారు. ఎస్పీ నిర్దేశంలో ఇద్దరు సీఐలు ప్రశ్నలవర్షం కురిపించారు. 
 
చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌లను ఎందుకు అసభ్యకరంగా తిట్టారు? ఎవరు చెబితే తిట్టారు? ఎవరైనా ముందుగా స్ర్కిప్ట్‌ రాసి ఇచ్చారా? ఇలా తిట్టడం వెనుక.. ఇంకా ఎవరి హస్తం ఉంది.? వంటి అనేక ప్రశ్నలు పోసానిని అడిగినట్లు సమాచారం. ఇందుకు ఆయన స్పందిస్తూ… ‘నన్ను ఎవరూ ప్రేరేపించలేదు. ఎవరూ నాకు చెప్పలేదు. నేనే స్వయంగా మాట్లాడాను. అలా మాట్లాడటం తప్పే’ అని పోసాని అన్నట్టు తెలిసింది. 
 
ఎస్పీ 17 ప్రశ్నలు వేయగా, ఎక్కువగా నాకు తెలియదు.. గుర్తు లేదని తెలిపినట్టు సమాచారం. ఈ సమయంలో అప్పటి వీడియోలు చూపించగా, ‘లవ్‌ యూ రాజా’ అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. విచారణ అనంతరం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోసానిని రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచారు. 
 
కాగా, ప్రజలు, జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా నోటికొచ్చినట్లు పోసాని మాట్లాడ డం వల్లే ఆయనపై కేసు పెట్టినట్లు ఫిర్యాదుదారు చెన్నరాజుపోడు మాజీ సర్పంచ్‌ మణి తెలిపారు. టీడీపీ, జనసేన నాయకుల తల్లి, భార్య, బిడ్డల గురించీ ఇష్టమొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడారని పేర్కొన్నారు.