సెబీ కొత్త సారధిగా తుహిన్‌ కాంత పాండే

సెబీ కొత్త సారధిగా తుహిన్‌ కాంత పాండే

 స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ నూతన సారథిగా తుహిన్‌ కాంత పాండే నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న ఆయనకు సెబీ చీఫ్‌ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర నియామకాల కమిటీ గురువారం ఇందుకు ఆమోదం తెలిపింది. 

కాగా, ప్రస్తుతం సెబీ చీఫ్‌గా ఉన్న మాధాబీ పురీ బుచ్ మూడేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తుహిన్‌ కాంత పాండేను సెబీ కొత్త చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. తుహిన్‌ కాంత పడే 1987 బ్యాచ్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో ఆర్థిక కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. 

ఎయిరిండియా ప్రైవేటీకరణలో పాండే కీలక పాత్ర పోషించారు. తుహిన్ కాంత పాండేకు ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌లో విస్తృత అనుభవం ఉంది. రానున్న మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇక ఇప్పటి వరకూ సెబీకి చీఫ్‌గా వ్యవహరించిన మాధాబీ పూరీ బుచ్‌ను కేంద్రం 2022 ఫిబ్రవరి 28న నియమించిన విషయం తెలిసిందే. 

దీంతో ఆమె అదే ఏడాది మార్చి 2వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. సెబీకి ఓ మ‌హిళ‌ చైర్మన్‌గా నియామ‌కం కావ‌డం ఇదే తొలిసారి. మాధవి గ‌తంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ హెడ్‌గా సేవ‌లందించారు. 2017 నుంచి 2021 మ‌ధ్య కాలంలో సెబీ పూర్తి స్థాయి మెంబ‌ర్‌గా ప‌ని చేశారు. సెబీ చీఫ్‌గా ఆమె పదవీ కాలం నేటితో ముగియనుంది.