చట్టాలు అమలు చేస్తేనే మహిళలకు భద్రత

చట్టాలు అమలు చేస్తేనే మహిళలకు భద్రత
కేవలం చట్టాలు చేయడం వల్ల మహిళలపై నేరాలు జరగడం ఆగిపోవని, వాటిని సక్రమంగా అమలు చేస్తేనే ఆగుతాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ స్పష్టం చేశారు. పూనే బస్సులో మహిళపై అత్యాచారం జరిగిన సంఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన 2012 నాటి నిర్భయ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
ముంబయిలో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పూనే బస్సు సంఘటన గురించి విలేకర్లు ప్రశ్నించగా మహిళల కోసం చేసిన చట్టాలను సక్రమంగా అమలు చేయగలిగితేనే ఇటువంటి లైంగిక వేధింపుల సంఘటనలు నివారించగలుగుతామని చెప్పారు. ఆనాటి నిర్భయ సంఘటన తర్వాత చట్టాల్లో చాలా మార్పులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. 
 
ఇటువంటి చట్టాలు చేసినంత మాత్రాన నేరాలు ఆగిపోవు, చట్టాలు రూపొందించడంతో పాటూ వాటిని అమలు చేసే విధానం కూడా అత్యంత కీలకమని, అలాగే సమాజం బాధ్యత కూడా చాలా బృహత్తరమైనదని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పనుల కోసం బయటకు వెళుతున్నారని చెబుతూ అటువంటపుడు వారి కోసం చేసే చట్టాలు వారు సురక్షితంగా వున్నామని భావించేలా అమలు చేయాలని పేర్కొన్నారు. 
 
సక్రమ దర్యాప్తు, గట్టి చర్యలు, శీఘ్రగతిన విచారణ, శిక్ష విధింపు వంటి చర్యలు తీసుకోవాల్సి వుందని చెప్పారు. ఇందులో చట్టపరమైన వ్యవస్థ, పోలీసులకు బృహత్తరమైన బాధ్యత వుందని తెలిపారు. మహిళలు వారి ఉద్యోగాలను సురక్షితంగా చేసుకోగలిగేలా మనం ప్రతి స్థాయిలోనూ దీని గురించి అత్యంత జాగ్రత్తగా ఆలోచించాలని చంద్రచూడ్ సూచించారు. సమ సమాజం యొక్క ప్రాధమిక విధి ఇదని ఆయన స్పష్టం చేశారు.