
హిమాలయ దేశం నేపాల్‌లో భూకంపం సంభవించింది. దేశ రాజధాని కాఠ్‌మాండూ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. సింధుపాల్ చౌక్ జిల్లాలోని భైరవ్ కుండలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది.
భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. దుగుంగడి భీర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయని, అయితే ఆ ప్రదేశంలో ఇండ్లు లేవని చెప్పారు. భారత్‌తోపాటు చైనా, టిబెట్ సరిహద్దుల్లో కూడా భూమి స్వల్పంగా కంపించదని తెలిపారు.
ఈ భూకంపం ధాటికి భారత్‌లోని బిహార్‌లో కూడా శుక్రవారం రాత్రి 2.36 గంటలకు 5.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకు తమకు సమాచారం లేదని నేపాల్ పోలీస్ డీఐజీ దినేశ్ కుమార్ ఆచార్య తెలిపారు. భూకంప కేంద్రం ప్రాంతంలోనూ నిర్మాణాలకు పెద్దగా దెబ్బతిన్నట్లు సమాచారం లేదని తెలిపారు.
అత్యంత చురుకైన టెక్టోనిక్ జోన్లలో (సీస్మిక్ జోన్లు IV, V) నేపాల్ ఉంది. దీంతో ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ హిమాలయ దేశంలో అత్యంత భయకరమైంది 2015 భూకంపం. 7.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం 9000మందిని బలితీసుకుంది. దాదాపు 10 లక్షల నిర్మాణాలు దెబ్బతిన్నాయి.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 5.14 గంటలకు పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. నేపాల్ భూకంప ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. బీహార్ రాజధాని పాట్నాతోపాటు పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
కాగా, పాట్నాలో భూకంపానికి సంబంధించి పలు వీడియోలను పలువురు సోషల్ మీడియాలు పోస్టు చేశారు. 35 సెకండ్లపాటు భూమి కంపించిందని, దీంతో ఇండ్లలో ఫ్యాన్లు, వస్తువులు ఊగిపోయాయని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో టిబెల్‌లో వరుసగా ఆరుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 7.1 తీవ్రత నమోదవగా, 125 మందికిపైగా మరణించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్