రూ. 44 కోట్లతో అమెరికా పౌరసత్వం పొందొచ్చు

రూ. 44 కోట్లతో అమెరికా పౌరసత్వం పొందొచ్చు
 
* భారతీయ ప్రొషెషనల్స్‌ను మరింత నిరాశ!
 
అమెరికా పౌరసత్వాన్ని పొందాలని ఆశిస్తున్న సంపన్న విదేశీ వలసదారుల కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. గోల్డ్‌ కార్డులను కొనుగోలు చేయడం ద్వారా అమెరికా పౌరసత్వాన్ని సులభంగా పొందే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. 
 
5 మిలియన్‌ డాలర్లకు(సుమారు రూ.44 కోట్లు) గోల్డ్‌ కార్డులను విక్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ గోల్డ్‌ కార్డులు గ్రీన్‌ కార్డు నివాసంతో సమానమని, విదేశీయులు అమెరికన్‌ పౌరసత్వాన్ని పొందడానికి ఇది మార్గమని ట్రంప్‌ ప్రకటించారు.

పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నట్టు పేర్కొంటూ “గోల్డ్‌ కార్డ్‌” వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో మరింత ధనవంతులవుతారని, విజయాలు సాధిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించడమే కాకుండా ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తారని ఓవల్ కార్యాలయంలో మీడియాకు తెలిపారు. 

ఈబీ-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా, గోల్డ్‌ కార్డ్‌లపై అలాంటిదేమీ ఉండదని ట్రంప్ తెలిపారు. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు తమ ప్రభుత్వం కోటి గోల్డ్‌ కార్డ్‌లను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మరో రెండు వారాల్లో ఈబి-5 వీసాలను “గోల్డ్‌ కార్డ్‌లతో” భర్తీ చేయనున్నట్టు వాణిజ్య మంత్రి హోవర్డ్‌ తెలిపారు. 

ఇది కూడా ఒకరకంగా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డ్‌ లాంటిదేని పేర్కొన్నారు. ఈబి-5 ప్రోగ్రామ్‌ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్టు చెప్పారు. సుమారు 1 కోటి గోల్డ్‌ కార్డులను విక్రయిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం వల్ల దేశం ఎదుర్కొంటున్న రుణ భారం తొలగిపోతుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. అమెరికన్‌ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే విదేశీ సంపన్నులకు ఈబీ-5 ప్రోగ్రామ్‌ కింద గ్రీన్‌ కార్డులను ప్రసాదిస్తారు.

కాగా, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా గోల్డ్‌ కార్డ్‌ ప్రకటన గ్రీన్‌ కార్డు కోసం ఎన్నో ఏళ్లుగా ఆశగా నిరీక్షిస్తున్న భారతీయ ప్రొషెషనల్స్‌ను మరింత నిరాశకు గురిచేసే అవకాశం కనపడుతోంది. అమెరికా రెసిడెన్సీ పొందేందుకు నేరుగా దారి చూపించే ఈ కొత్త పథకం భారతీయ కుబేరులు, వ్యాపార దిగ్గజాలకు మాత్రమే ఉపయోగపడే అవకాశం ఉంది. 

సుదీర్ఘ కాలంగా, కొన్ని సందర్బాలలో అనేక దశాబ్దాలుగా గ్రీన్‌ కార్డు కోసం వెయిటింగ్‌ లిస్టులో ఉన్న స్కిల్డ్‌ ప్రొఫెషనల్స్‌ కష్టాలు ఈ కొత్త పథకం వల్ల మరింత పెరిగే అవకాశం ఉంది. ఈబీ-5 కింద దరఖాస్తుదారులు రుణాలు తీసుకోవడం లేదా నిధులు సమీకరించుకోవడానికి అవకాశం ఉండగా గోల్డ్‌ కార్డులను నగదు చెల్లింపు ద్వారా మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి భారతీయులకు ఈ పథకం అందుబాటులో ఉండే అవకాశం ఏమాత్రం లేదు.

ఈబీ-5 వీసా విధానాన్ని 1990లో అమెరికా కాంగ్రెస్‌ ఆమోదించింది. హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం గణాంకాల ప్రకారం 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబర్ 30 వరకు దాదాపు 8వేల మంది ఈ ఇన్వెస్టర్‌ వీసాలను పొందారు.  అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని నాలుగేళ్ల క్రితం ఓ అధ్యయనంలో తేలింది. గోల్డెన్‌ వీసాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. 

యూకే, స్పెయిన్‌, గ్రీస్‌, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం ఈబి-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా, ‘గోల్డ్‌ కార్డ్‌’లపై అలాంటిదేమీ ఉండదని అధ్యక్షుడు తెలిపారు.