ఆరేండ్లు పోటీకి అనర్హులను చేస్తే చాలు

ఆరేండ్లు పోటీకి అనర్హులను చేస్తే చాలు

క్రిమినల్‌ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతలు రాజకీయ పదవులను చేపట్టకుండా జీవిత కాలం నిషేధించడం కఠిన చర్య అవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత విధానం ప్రకారం ఇటువంటివారిని ఆరు సంవత్సరాలపాటు అనర్హులను చేయడం సరిపోతుందని చెప్పింది.  ఎంత కాలం అనర్హులుగా ప్రకటించాలనేది పూర్తిగా పార్లమెంట్‌ పరిధిలోని అంశమని తెలిపింది.

దామాషా, సమంజసత్వ సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకుని, దోషిని ఎంత కాలం అనర్హుడిగా ప్రకటించాలి? అనే దానిని సభ నిర్ణయిస్తుందని వివరించింది. మన దేశంలో రాజకీయ నాయకులు క్రిమినల్‌ కేసులో దోషులుగా నిరూపితమైతే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్‌ 8లోని సబ్‌సెక్షన్ల ప్రకారం ఆరేట్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించబడుతుంది.

అయితే రాజకీయ నాయకులపై ఆరేళ్ల నిషేధం సరిపోదని, జీవితాంతం ఎన్నికల్లో పోటీకి నిషేధం విధించాలని 2016లో అశ్వినీ ఉపాధ్యారు అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.  ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల విచారణ జరిపి దీనిపై అఫడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 10వ తేదీన కేంద్రం దీనిపై సుప్రీంకోర్టులో అఫడవిట్‌ దాఖలు చేసింది. క్రిమినల్‌ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించడం అత్యంత కఠినమైన చర్య అని స్పష్టం చేసింది.

1951 ప్రజాప్రాతినధ్య చట్టం ప్రకారం ఆరేళ్ల నిషేధం సరిపోతుందని కేంద్రం తన అఫడవిట్‌లో పేర్కొంది. కాగా, ఈ కేసులో అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి సహాయం చేస్తారని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంపై ఎన్నికల సంఘం కూడా స్పందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. మార్చి 4వ తేదీన ఈ పిటిషన్‌పై విచారించనుంది. ఇక ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.

పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలు విస్తృత స్థాయి పర్యవసానాలు కలిగినవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇవి పార్లమెంటు శాసన విధానం పరిధిలోనివని చెప్పింది. అనర్హత వేటు వేయడానికి తగిన కారణాలను, దాని కాల వ్యవధిని నిర్ణయించడానికి పార్లమెంటుకు రాజ్యాంగం అధికారం కల్పించిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.