హైద‌రాబాద్‌లో సినీ నటుడు పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్ట్

హైద‌రాబాద్‌లో సినీ నటుడు పోసాని కృష్ణ‌ముర‌ళి అరెస్ట్

సినిమా నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఇప్ప‌టికే పోసానిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు కేసులు న‌మోదు అయ్యాయి. సినిమా నటుడిగా, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. 

మొదట్లో టిడిపికి సానుభూతిపరుడిగా ఉండే వారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉంది, వైసిపిలో చేరారు. 2019 కంటే ముందు నుంచి వైసిపి కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్, చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. 

దీంతో ఆయన అనేక కేసుల్లో చిక్కుకున్నారు. వాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మాట్లాడటంతోపాటు బూతులతో రెచ్చిపోయే వాళ్లు. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పల్లెలో నమోదు అయిన కేసు ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. పోసాని కృష్ణ మురళిని బుధవారం రాత్రి 8.45 నిమిషాలకు అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

కులాల పేరుతో దూషించి ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించినందుకు ఆయన్ని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ఆయనపై 196, 353(2),111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోసాని అరెస్టు సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్టు చేసేందుకు హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలోని న్యూసైన్స్ కాలనీలో ఉన్న ఆయన ఇంటికి పోలీసులు వెళ్లారు. 

అక్కడ వారితో పోసాని వాగ్వాదానికి దిగారు. రాత్రి వేళలో వచ్చి పోలీసులం అని చెబితే ఎలా నమ్మేది అని అన్నారు. అసలు అనుమతి లేకుండా తన ఇంటికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. దీనికి పోలీసులు కూడా ఘాటుగా స్పందించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికైనా వెళ్లొచ్చని అరెస్టు చేయవచ్చని స్పష్టం చేశారు.

వైసిపి అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్లను టార్గెట్ చేసుకొని మాట్లాడారు. సన్నిహితుల సలహా మేరకు ఈ మధ్య కాలంలోనే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇకపై సినిమాలపైనే ఫోకస్ చేస్తానంటూ ప్రకటించారు.