మహా కుంభమేళాలో అంతిమ ‘స్నానం’

మహా కుంభమేళాలో అంతిమ ‘స్నానం’
* ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయం … మోదీ

‘హర హర మహాదేవ’ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు బుధవారం మహా శివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. 45 రోజులుగా సాగుతున్న మహా కుంభమేళా బుధవారంతో పరిసమాప్తం అయింది.  ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా నిలిచిన ఈ వేడుకకు త్రివేణి సంగమం సాక్షిగా నిలిచింది. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మెగా మత ఉత్సవం మహా కుంభమేళా జనవరి 13న (పుష్య పౌర్ణమి) మొదలు కాగా నాగ సాధువుల మహా ఊరేగింపులు, మూడు అమృత్ స్నాన్‌లు చోటు చేసుకున్నాయి.

అధికార గణాంకాల ప్రకారం,  జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు జరిగిన ఈ మేళాలో 66.21 కోట్ల మందికి పైగా పాల్గొని పుణ్య స్నానాలు చేశారు. ఇక ఆఖరి రోజు1.44 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్టు అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ఇది రికార్డులకెక్కింది. దేశ, విదేశీ ప్రముఖులు ఈ కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. ఈ కుంభమేళాకు ప్రత్యక్షంగా హాజరు కాని భక్తులకు డిజిటల్‌ ఫొటో స్నానం చేయించడం విశేషం.. 

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కుంభ మేళాల్లో ఏర్పాట్లను సీనియర్ ప్రభుత్వ అధికారులతో కలసి సమీక్షించనారంభించారు. చివరి రోజు స్నానం ఆచరించిన భక్తులపై హెలికాప్టర్లతో 20 క్వింటాళ్ల గులాబీ పూల వర్షం కురిపించారు. దీంతో అక్కడి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో 45 రోజుల్లో 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. త్రివేణి సంగ‌మంలోని అరైల్ ఘ‌ట్ వ‌ద్ద ఆయన ఈ సందర్భంగా ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. బోటులో ప్ర‌యాణం చేసి, గంగా హార‌తిలో పాల్గొన్నారు. యూపీ మంత్రివర్గం ఈ కార్యక్రమంలో పాల్గొన్న‌ది

ఆ త‌ర్వాత పారిశుద్ధ కార్మికుల‌తో క‌లిసి సీఎం యోగి భోజ‌నం చేశారు.  మంత్రులు, పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. మ‌హాకుంభ్‌లో పాల్గొన్న‌ శానిటేష‌న్, హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు రూ. 10,000 వేల బోన‌స్ ఇవ్వ‌నున్న‌ట్లు ముఖ్యమంత్రి  తెలిపారు.  ఏప్రిల్ నెల నుంచి శానిటేష‌న్ వ‌ర్క‌ర్ల‌కు క‌నీస వేతనం రూ. 16,000 అందే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. తాత్కాలిక హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు నేరుగా న‌గ‌దును బ్యాంక్ అకౌంట్ల‌కు బదిలీ  చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఆ కార్మికుల‌కు ఆయుష్మాన్ భార‌త్ ఆరోగ్య బీమా క‌ల్పించ‌నున్న‌ట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో ఈ మహాకుంభమేళాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందని,  భారతీయ ఐక్యతకు ఈ కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించినట్లు చెప్పారు. 

ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలూ లేకుండా విజయవంతంగా నిర్వహించడం అంత సులువు కాదని పేర్కొన్నారు. అన్నిటినీ దాటుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం, ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని గంగా, యమునా, సరస్వతి మాతాలను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు ఏర్పాట్ల విషయం లోపాలున్నా, భక్తులెవరైనా అసౌకర్యానికి గురైనా అందుకు క్షమించాలని ప్రధాని కోరారు.