
* 2024 రికార్డు స్థాయిలో అత్యంత వెచ్చని సంవత్సరం
ప్రజలలో పర్యావరణం పట్ల పెరుగుతున్న స్పృహను ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రతిబింబిస్తున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సిఎస్ఈ) డైరెక్టర్ జనరల్ సునీతా నరైన్ తెలిపారు. పర్యావరణం, అభివృద్ధి అంశాలపై రాసే భారతదేశానికి చెందిన జర్నలిస్టుల వార్షిక సమావేశం అనిల్ అగర్వాల్ డైలాగ్ 2025లో ఆమె మాట్లాడుతూ, అయితే, పర్యావరణ నిర్వహణ ఖరీదైనది, సమిళితం కానిది ఆమె విచారం వ్యక్తం చేశారు.
“మనం 2025లో ముందుకు సాగుతున్న కొద్దీ మంచి, చెడు వార్తలు ఉన్నాయి. శుభవార్త ఏమిటంటే పర్యావరణ స్పృహ పెరిగింది. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన యమునా, వీధుల్లో చెత్త ఓటర్లు ఆందోళన చెందుతున్న సమస్యలని వెల్లడైంది. ప్రభుత్వాలు పర్యావరణం కోసం కార్యక్రమాలను ప్రకటించాల్సి వచ్చింది” అని ఆమె చెప్పారు.
మరోవంక, రైతులు తమ నేల, నీటి గురించి శ్రద్ధ వహించడం; పరిశ్రమలకు ఎటువంటి సంఘర్షణలు లేకుండా వనరుల భద్రత అవసరమని గుర్తించడం జరుగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. అయితే, “మనం తగినంత ప్రతిష్టాత్మకం కాని కార్యక్రమాలు; బలహీనమైన సంస్థలు; ఖరీదైన – సమ్మిళితం కానీ పర్యావరణ నిర్వహణ మార్గంతో నిండి ఉన్నాము” అని ఆమె తెలిపారు.
రాజస్థాన్‌లోని నిమ్లిలో ఉన్న అనిల్ అగర్వాల్ ఎన్విరాన్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సీఎస్ఈ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ విలక్షణమైన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 80 మందికి పైగా జర్నలిస్టులు పాల్గొంటున్నారు. జి20 షెర్పా అమితాబ్ కాంత్, ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్పర్సన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ఆర్థిక గురువు రాజ్ లిబర్హాన్లతో కలిసి నరైన్ `2025 స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్మెంట్’ నివేదికను విడుదల చేశారు.
భారతదేశంలో, మన నగరాల్లో 42 నగరాలు ప్రపంచంలోని 50 అత్యంత కలుషిత నగరాల్లో మన దేశంలోని మున్సిపల్ పాలన భారీ వైఫల్యాన్ని సూచిస్తుందని కాంత్ విచారం వ్యక్తం చేశారు. సూరత్, ఇండోర్ వంటి నగరాల విజయవంతమైన నమూనాలను మనం ప్రతిబింబించాలని సూచించారు.
నీటి వినియోగం- ధర నిర్ణయించడం, పారిశ్రామిక కాలుష్యంపై దృష్టి సారించాలని అహ్లువాలియా సూచించారు. “కాలక్రమేణా, నీటి సమస్యలు మరింత దిగజారిపోతున్నాయి. నీటిని పొదుపుగా మార్చాలని మనం గుర్తించాలి. మొత్తం నీటి సరఫరాను జాతీయం చేసి రేషన్ చేయాలి లేదా నీటికి తగినంత ధర నిర్ణయించాలి” అని స్పష్టం చేశారు.
పరిశ్రమల విషయంలో కాలుష్యం, మురుగునీటి అంశాలపై ఎటువంటి రాజీ ఉండకూడదని ఆయన తేల్చి చెప్పారు. చిన్నవి లేదా పెద్దవి అనేదానితో సంబంధం లేకుండా కాలుష్య కారకం చెల్లించాలని సూచించారు. భారతదేశ పర్యావరణ నివేదిక యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్‌ను ఉటంకిస్తూ, 2024 ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 1.5 oసి కంటే “స్పష్టంగా” ఎక్కువగా ఉన్న మొదటి క్యాలెండర్ సంవత్సరం అని పేర్కొంది.
“21వ శతాబ్దపు మొదటి తరం – జనరేషన్ ఆల్ఫా – ఇది తీవ్ర నష్టపు వారసత్వం. వారి పూర్వీకులకు, వాతావరణ మార్పు ఒక గ్రహ అత్యవసర పరిస్థితి. కానీ జనరేషన్ ఆల్ఫా – 2025 నాటికి అంచనా వేయబడిన రెండు బిలియన్ల ప్రజలను కలిగి ఉంటుంది. ఇది చరిత్రలో అతిపెద్ద తరాన్ని చేస్తుంది. వాతావరణపరంగా మారిన, వెచ్చని గ్రహాన్ని భరిస్తోంది” అంటూ వార్షిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
వాస్తవానికి, 2024 సంవత్సరం రికార్డు స్థాయిలో అత్యంత వెచ్చని సంవత్సరం. సగటు ప్రపంచ ఉష్ణోగ్రత పారిశ్రామిక పూర్వ యుగం (1850-1900) సగటు కంటే 1.60 o సి ఎక్కువగా ఉంది. సిఎస్ఈలో పర్యావరణ వనరుల ప్రోగ్రామ్ డైరెక్టర్ కిరణ్ పాండే ఇలా అన్నారు: “2024 వాతావరణ మార్పుకు ముందు,తరువాత యుగాలను విభజించిన సంవత్సరంగా గుర్తుండిపోతుంది.”
“ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలలో ప్రతి డిగ్రీ పెరుగుదలకు వాతావరణ తేమ స్థాయిలు 7 శాతం పెరుగుతాయనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, తీవ్రమైన వాతావరణ సంఘటనల పరంగా గ్రహ అంతరాయాలకు ఇది సరైన సూచిక” అని ఆమె పేర్కొన్నారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?