ఎన్నికలు, ప్రచారాల కోసం బిజెపి రూ.1,754 కోట్లు

ఎన్నికలు, ప్రచారాల కోసం బిజెపి రూ.1,754 కోట్లు

బిజెపి 2023-24  ఎన్నికలు, ప్రచారాల కోసం రూ.1,754 కోట్లు వ్యయం చేసినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) నివేదిక తెలిపింది. ఆ ఏడాది పార్టీ వ్యయంలో సింహభాగం ఎన్నికల కోసమే ముఖ్యంగా ప్రకటనల కోసం చేసినట్లు వెల్లడించింది. ఆరు జాతీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌ (ఈసి)కి సమర్పించిన వార్షిక ఆడిట్‌ రిపోర్ట్‌ను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది.

2024 లోక్‌సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం  రూ.1,754 కోట్లు ఖర్చు చేసినట్లు బిజెపి ఈసికి తెలిపింది. వాటిలో రూ.884.45 కోట్లు పార్టీ  ప్రచారం కోసం, రూ.853.23 కోట్లు అభ్యర్థుల కోసం కేటాయించినట్లు పేర్కొంది. ఈ మొత్తం  కాంగ్రెస్‌ పార్టీ ఖర్చు చేసిన రూ.584.65కోట్లకన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ. 2019 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి ఖర్చు చేసిన మొత్తంతో పోలిస్తే 2024లో ఖర్చు 37శాతం అధికం. బిజెపి ఈసికి సమర్పించిన ఆడిట్‌ నివేదిక ప్రకారం 2019లో రూ.1,264.33 కోట్లు ఖర్చు చేసింది.

బిజెపి దాదాపు రూ.611.50 కోట్లు ఖర్చు చేయగా, అందులో అత్యధిక మొత్తం మీడియాలో ప్రకటనల కోసం ముఖ్యంగా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రకటనలు, గంపగుత్త ఎస్‌ఎంఎస్‌లు, కేబుల్‌, వెబ్‌సైట్‌ ,టివీ చానల్స్‌లో ప్రచారాల కోసం వినియోగించింది. మొత్తంగా రూ.156.95 కోట్లు గూగుల్‌ ఇండియాకు ఇవ్వగా, రూ.24.63 కోట్లు ఫేస్‌బుక్‌కు కేటాయించారు. 

ఎన్నికల ప్రచారం కోసం పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు, జెండాలు వంటి ప్రచార సామాగ్రి కోసం రూ.55.75కోట్లు ఖర్చు చేసిందని బిజెపి తెలిపింది. బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీల కోసం అదనంగా రూ.19.84కోట్లు కేటాయించింది. పార్టీ ఖర్చులో మరో ముఖ్యమైన భాగం ప్రచారానికి సంబంధించి ప్రయాణఖర్చులు రూ.168.92 కోట్లు. స్టార్‌ క్యాంపెయినర్ల ఖర్చులు, ఇతర ఖర్చులు దీనిలో ఉన్నాయి. 

ఇతర పార్టీల నేతల ప్రయాణాలకు అదనంగా రూ.2.53కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రాల ఎన్నికల ప్రకటన తేదీ నుండి పూర్తయ్యే వరకు చేసిన ఖర్చు అరుణాచల్‌ ప్రదేశ్‌ (రూ.5,552.57 కోట్లు), సిక్కిం (రూ.5,552.41కోట్లు), ఒడిశా (రూ.5,555.65 కోట్లు).