
ఉద్యోగాల కోసం భూ కేటాయింపుల కుంభకోణంలో కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్ సహా 77 మంది ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్, కుమార్తె హేమా యాదవ్‌లకు కూడా సమన్లు జారీ అయ్యాయి. సిబిఐ సమర్పించిన తుది నివేదికతో పాటు మూడు చార్జిషీట్లను పరిగణనలోకి తీసుకుంది.
నిందితులందరూ మార్చి 11న కోర్టు ఎదుట హాజరుకావాలని రోస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక సిబిఐ జడ్జి విశాల్ గోగె ఆదేశాలు జారీ చేశారు. అన్ని చార్జిషీట్లపై ఉమ్మడి విచారణ జరుగుతుందని నిర్ధారించారు. నిందితులందరికీ చార్జిషీట్ కాపీలను అందించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.
2004-2009 మధ్యకాలంలో గ్రూప్ డి రైల్వే ఉద్యోగాల కోసం లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబానికి భూబదలాయింపుల కోసం తన మంత్రి పదవిని ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ సీబీఐ 2022 మే 18న కేసు నమోదు చేసింది. నియామకాల కోసం ప్రకటనలు లేదా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయలేదని పిటిషన్‌లో పేర్కొంది.
అభ్యర్థులను తొలుత పాట్నానుండి రిక్రూట్ చేశారని అనంతరం ముంబయి, జైపూర్, హాజీపూర్ రైల్వే జోన్‌లకు పంపారని పేర్కొంది. ఉద్యోగాల కోసం పలువురు అభ్యర్థులు తమ భూములను లాలూ కుటుంబ సభ్యులకు లేదా వారికి సంబంధించిన ప్రైవేట్ కంపెనీకి విక్రయించినట్లు లేదా బహుమతిగా ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సాక్ష్యాధారాలను సేకరించేందుకు సిబిఐ ఢిల్లీ, బీహార్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే.
More Stories
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి