
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమ మైనింగ్, భూకబ్జాలు తదితర వ్యవహారాలపై నలుగురితో సిట్ ఏర్పాటు చేసింది. ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్‌లకు సిట్‌లో చోటు కల్పించింది.
అక్రమ మైనింగ్ సహా వివిధ నేరాల్లో ప్రభుత్వానికి రూ. 195 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం వాటిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిట్‌కు సూచించింది. మరోవంక, కిడ్నాప్ కేసులో జైలులో ఉన్న వల్లభనేని వంశీని విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మూడు రోజుల కస్టడీకిస్తూ ఆదేశాలిచ్చింది.
విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకొని, న్యాయవాది సమక్షంలో వంశీని విచారించాలని ఆదేశించింది. ఇదే సమయంలో వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నానని వంశీ వేసిన పిటిషన్పై విచారించిన కోర్టు జైలులో వంశీకి బెడ్ సదుపాయం కల్పించేందుకూ అనుమతించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారించాలని ఆదేశాలు జారీచేసింది.గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కి తీసుకునేలా ఫిర్యాదుదారు సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించడం వెనుక కుట్రను ఛేదించేందుకు వంశీని పోలీసులు పది రోజుల కస్టడీకి కోరారు. గతవారమే తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా వంశీని మూడురోజుల కస్టడీకి అనుమతించింది.
మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజయవాడ కోర్టులో సిఐడి అధికారులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇటీవలే ఈకేసులో వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడం, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈనెల 25తో రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో సిఐడి అధికారులు పీటీ వారంట్ వేశారు.
తాజాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఏ27 శివకుమార్, ఏ28 ఆదిలక్ష్మి, ఏ54 ప్రవీణ్ అరెస్టు అయ్యారు. వీరందరికీ జడ్జి రిమాండ్ విధించారు.
More Stories
భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా స్వదేశీ సంత
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు