‘ఆటవిక రాజ్యాన్ని’ తెచ్చినోళ్లు కుంభమేళాపై అసభ్యకర వ్యాఖ్యలు

‘ఆటవిక రాజ్యాన్ని’ తెచ్చినోళ్లు కుంభమేళాపై అసభ్యకర వ్యాఖ్యలు

* కుంభమేళాను విమర్శించేవారు రాబందులు, పందులు… యోగి

బిహార్‌లో ‘ఆటవిక రాజ్యాన్ని’ తెచ్చినోళ్లు కుంభమేళా గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ,  మహా కుంభమేళపై ఆర్జేడీ అధినేత లాలూ ‘అసభ్యకరమైన’ వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. భారత ఐక్యతను కుంభమేళా వేడుక నిదర్శనం అని స్పష్టం చేశారు. 
 
ఐరోపా జనాభాకు మించి ప్రయాగ్‌రాజ్‌లో భక్తులు పుణ్యసాన్నాలు చేశారని, బిహార్‌ నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వచ్చారని గుర్తు చేశారు. అయితే ‘ఆటవిక రాజ్యం వాళ్లు’ మన సంస్కృతి, వారసత్వాలు, నమ్మకాలను ద్వేషిస్తారని లాలూ పేరును ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. ఇలాంటి వారు అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కూడా వ్యతిరేకించారని, దీన్ని బిహార్‌ ప్రజలూ మరిచిపోలేరని పేర్కొన్నారు. 
 
ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజీనామా చేయాలని లాలూ ప్రసాద్‌ డిమాండ్‌ చేస్తూ ‘‘కుంభమేళాతో ఏం ప్రయోజనం? అదో మూర్ఖపు తంతు” అని విమర్శించారు. రైతులు బాగుపడాలనే ఉద్దేశం ఆర్జేడీకి లేదని, పశువుల దాణాను భోంచేసిన వారికి రైతుల ప్రయోజనం గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంటుంది? అని మోదీ ఎద్దేవా చేశారు.

అప్పట్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసి బిహార్‌లో అధికారాన్ని వెలగబెట్టడం ద్వారా ఆ రాష్ట్రాన్ని నాశనం చేశాయని ప్రధాని మండిపడ్డారు. ఈ కార్యక్రమం సందర్భంగా పీఎం-కిసాన్‌ కింద రైతుల ఖాతాల్లో 19వ విడత పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో వేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద రైతులకు ఎన్డీయే ప్రభుత్వం ఎంతో చేసిందని, కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా 9.8కోట్ల మంది రైతుల ఖాతాల్లో 19వ విడత పెట్టుబడి సాయం కోసం రూ.22వేల కోట్లు వేశామని ప్రధాని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం ప్రారంభించే ముందు ఆయన్ను తామరగింజలతో తయారు చేసిన దండతో సన్మానించారు. తామరగింజలు మంచి ఆహారం అని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో తాను తామరగింజలను దాదాపు రోజూ ఆహారంలో తీసుకుంటానని మోదీ చెప్పారు. బిహార్‌లో తామరగింజల ఉత్పత్తి బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించామని గుర్తు చేస్తూ తామరగింజలకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌ ఉందని చెప్పారు.

కాగా, మహా కుంభమేళాను విమర్శించేవారిపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటివారు రాబందులు, పందులు అని ప్రతి విమర్శ చేశారు. కుంభమేళాలో ఎవరు ఏది కోరుకుంటే అదే దొరుకుతుందని ఎద్దేవా చేశారు. ‘రాబందులకు శవాలు దొరుకుతాయి. పందులకు బురద దొరుకుతుంది. సున్నితమైన వ్యక్తులకు అద్భుతమైన సంబంధాలు దొరుకుతాయి. వ్యాపారులకు బేరాలు, భక్తులకు స్వచ్ఛమైన ఏర్పాట్లు ఉన్నాయి’ అని చెప్పారు.

‘నిర్వహణ లోపాల వల్ల హజ్‌లో తొక్కిసలాట జరిగితే లౌకిక మేధావులు ఎవరూ మాట్లాడలేదు. అలాంటివారే కుంభమేళా ఏర్పాట్లపై విమర్శలు చేస్తున్నారు. ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తూనే ఉన్నారు’ అని చెప్పారు. కుంభమేళాలో దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ భక్తుల విశ్వాసం, ఉత్సాహంలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. 

సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌పై విమర్శలు చేస్తూ వారిలాగా మతవిశ్వాసాలతో ఆడుకోబోమని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుంభమేళా ఏర్పాట్లను సక్రమంగా చేయలేదని ఆరోపించారు.