
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఫార్ములా ఈ రేసు స్కాముల్లో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉందని, ఆధారాలున్నాయని స్వయంగా చెప్పి కూడా 14 నెలలైనా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ డీల్ కుదుర్చుకున్నందున తెలంగాణలో బలపడుతున్న బీజేపీని అణిచివేయడానికి బీఆర్ఎస్ తో కలిసి లోపాయికారీ ఒప్పందం చేసుకుని కేసులు నీరుగారుస్తున్నారా? అని నిలదీశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో జిల్లా బీజేపీ ప్రభారీలతో నిర్వహించిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, బీజేపీ బలపర్చిన గ్రాడ్యుయేట్ అభ్యర్ధి అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డిలతో పాటు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. కాలేజీ యాజమాన్యాలు తమ కాలేజీలు మూసుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి మంచిర్యాల జిల్లాకు వస్తున్నారని చెబుతూ ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. అట్లా చేయకుండా సీఎం సభకు హాజరు కాకపోతే మీ అంతు చూస్తామని ఇక్కడి ఎమ్మెల్యేలు బెదిరిస్తుండటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు.
దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరువైన పరిస్థితి కాంగ్రెస్ కే దక్కిందని పేర్కొంటూ పోటీ చేసే వాళ్లు లేకపోవడంతో బయట నుండి తెచ్చిన వ్యక్తిని గ్రాడ్యుయేట్ అభ్యర్ధిగా నిలబెట్టారని, మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్థులే దొరకలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఏకంగా పోటీ నుండి తప్పుకునే కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తోందని ఆరోపించారు.
14 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలను నట్టేట ముంచారని పేర్కొంటూ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నరని, నెలానెలా రూ.4 వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తామన్నరని గుర్తు చేశారు. 14 నెలలుగా రూ.56 వేల బాకీ పడ్డారని,రుణమాఫీ సగం మందికి ఇవ్వనేలేదని, రైతు భరోసా అతీగతీ లేదని సంజయ్ విమర్శించారు.
ప్రజల కోసం కొట్లాడింది బీజేపీ, టీచర్ల కోసం లాఠీదెబ్బలు తిన్నది బీజేపీ, నిరుద్యోగుల కోసం రక్తం చిందించి కాళ్లు చేతులు విరగ్గొట్టుకుంది బీజేపీ అని స్పష్టం చేశారు. “నేను ప్రజల పక్షాన కొట్లాడుతుంటే నాపై హిందీ పేపర్ లీకేజీ కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వడ్ల కొనుగోలు విషయంలో రైతుల బాధలను తెలుసుకునేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనకు వెళితే బీఆర్ఎస్ వారు రాళ్ల దాడి చేసి భయపెట్టాలని చూశారు” అని ఆరోపించారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి