మస్క్ మెయిల్ పట్టించుకోవద్దు.. ఎఫ్‌బీఐ ఉద్యోగులతో కాష్ పటేల్

మస్క్ మెయిల్ పట్టించుకోవద్దు.. ఎఫ్‌బీఐ ఉద్యోగులతో కాష్ పటేల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తోన్న ఎలాన్ మస్క్ ప్రభుత్వ ఉద్యోగులకు పంపిన మెయిల్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఉద్యోగులందరూ గతవారం తాము ఏం పని చేశారో చెప్పాలని, అలా చేయలేని పక్షంలో రాజీనామా చేయాలని ఆయన కోరారు. ఈ అంశంపై అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) నూతన డైరెక్టర్‌, భారత సంతతికి చెందిన కాష్ పటేల్ తీవ్రంగా స్పందించారు. 
 
మస్క్ పంపిన మెయిల్‌ గురించి ఎఫ్‌బీఐ ఉద్యోగులు ఎవరూ పట్టించుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఉద్యోగులకు కాష్ పటేల్ మెయిల్ పంపారు.
‘‘ఎఫ్‌బీఐ సిబ్బందికి సమాచారం కోరుతూ యూఎస్‌ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (ఓపిఎం) నుంచి ఈ-మెయిల్ వచ్చి ఉండొచ్చు.  సంస్థ ఉద్యోగుల సమీక్ష ప్రక్రియకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కార్యాలయం బాధ్యత వహిస్తుంది” అని స్పష్టం చేశారు.
“ఎఫ్‌బీఐ విధానాలకు అనుగుణంగా సమీక్షలను నిర్వహిస్తుంది. ఒకవేళ మరిన్ని వివరాలు అవసరమైతే మిమ్మల్ని మేము సమన్వయం చేసుకుంటాం. ప్రస్తుతానికి దయచేసి ఏవైనా మెయిల్స్‌కు స్పందించవద్దు.’’ అని కాష్ పటేల్ ఎఫ్‌బీఐ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో పేర్కొన్నారు.

ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడు ప్రదర్శిస్తోన్న మస్క్ ఉద్యోగులకు మెయిల్ పంపి వారంలో ఏం చేశారో చెప్పాలని కోరారు. ఈ మెయిల్‌కు సోమవారం రాత్రి 11:59 గంటల్లోపు ఐదు వాక్యాల్లో సమాధానం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అయితే, ఈ మెయిల్‌పై ఎఫ్‌బీఐ మాదిరిగా పలు ప్రభుత్వ విభాగాలు సైతం స్పందించవద్దని తమ సిబ్బందికి సూచించారు. 

అమెరికాలోనే అతి పెద్ద ఉద్యోగ సంఘం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ (ఎఎఫ్ జిఇ) నేషనల్ ప్రెసిడెంట్ ఎవెరెట్ కెల్లీ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, దేశ ప్రజలకు అందించే క్లిష్టమైన సేవల పట్ల ఆయనకు ఉన్న అయిష్టతను సూచిస్తున్నాయని ఆరోపించారు. 
 
ప్రభుత్వం చట్టవిరుద్ధంగా తొలగించే ప్రయత్నం చేస్తే సవాల్ చేస్తామని హెచ్చరించారు. తన జీవితంలో ఒక్కసారి కూడా నిజాయితీగా ప్రజా సేవ చేయని మస్క్‌తో తమ ఉద్యోగులకు విధుల గురించి చెప్పించడం కించపరచడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వచ్చిన మెయిల్‌కు సమాధానం ఇవ్వరాదని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నట్లు కెల్లీ తెలిపారు.

మరోవైపు, తన మెయిల్‌పై వ్యతిరేకత వ్యక్తం కావడంతో మస్క్ కొంత వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దీనిపై ఎక్స్‌ (ట్విట్టర్) లో ఆయన ట్వీట్ చేస్తూ అర్ధమయ్యేలా కొన్ని బుల్లెట్ పాయింట్లతో కూడిన మెయిల్ పంపినా చాలని చెప్పారు.