
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని పలు దేశాలలో విశేషంగా ప్రజాదరణ పొందుతున్న మితవాద నాయకులను కొనియాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష నేతలను కపటవాదులని ఎద్దేవా చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఎసీ)లో పాల్గొన్న క్రమంలో ఆమె భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తనలాంటి మితవాద నేతల ఆవిర్భావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్ష నేతలంతా కలత చెందారని పేర్కొన్నారు.
ఇటలీ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 90వ దశకంలో బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్ గ్లోబల్ లెఫ్టిస్ట్ నెట్‌వర్క్‌ను సృష్టించినప్పుడు, వారు గొప్ప రాజనీతిజ్ఞులని కొనియాడారని ఆమె గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ట్రంప్, మెలోనీ, మోదీ మాట్లాడినప్పుడు, ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
ఇక్కడే వామపక్షాల ద్వంద్వ విధానం అర్థమవుతుందని మెలోని విమర్శించారు. మితవాద నాయకుల ఎదుగుదల నేపథ్యంలో వామపక్షాలు విసుగు చెందుతున్నాయని ఆమె ఆరోపించారు. వారు మనపై ఎన్ని బురద చల్లినా, పౌరులు తమకు ఓటు వేస్తున్నారని ఇటలీ ప్రధాని స్పష్టం చేశారు. ఎందుకంటే మనం స్వేచ్ఛను కాపాడుకుంటాం, మనం మన దేశాలను ప్రేమిస్తున్నామని మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు ప్రజలు వామపక్షాలు అనుకునేంత అమాయకులు కాదని ఆమె తేల్చి చెప్పారు. మనకు సురక్షితమైన సరిహద్దులు కావాలని పేర్కొంటూ వ్యాపారాలను, పౌరులను వామపక్ష పిచ్చి నుంచి రక్షిస్తామని మీలోని స్పష్టం చేశారు. “మేము కుటుంబాన్ని, జీవితాన్ని రక్షించుకుంటామని, మా విశ్వాసాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకుంటామని” ఆమె వెల్లడించారు.
ట్రంప్ విజయంతో వామపక్షాలు భయాందోళనకు గురవుతున్నాయని ఆమె చెప్పారు. ఈ క్రమంలో వారి చికాకు కూడా హిస్టరీగా మారిందని ఎద్దేవా చేశారు. ఎందుకంటే సంప్రదాయవాదులు గెలుపొందడం మాత్రమే కాదు, ఇప్పుడు సంప్రదాయవాదులు ప్రపంచవ్యాప్తంగా సహకరిస్తున్నారని ఆమె తెలిపారు. ఇటలీ మహిళా ప్రధాని ఈ నేతలను మెచ్చుకుంటూ ప్రసంగం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా