ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి 2గా శక్తికాంత్ దాస్

ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి 2గా శక్తికాంత్ దాస్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రధాని నరేంద్ర మోదీకి రెండవ ప్రిన్సిపల్ కార్యదర్శిగా శనివారం నియుక్తుడయ్యారు. గుజరాత్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఎఎస్ అధికారి పికె మిశ్రా ప్రస్తుతం ప్రధానికి ప్రిన్సిపల్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఒక అధికారిక ఉత్తర్వు ప్రకారం, తమిళనాడు కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఎఎస్ అధికారి శక్తికాంత దాస్ పదవీకాలం ప్రధాని పదవీ కాలంతో పాటు లేదా తిరిగి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు, ఏది ముందైతే అది ముగుస్తుంది.

‘ప్రధానికి ప్రిన్సిపల్ కార్యదర్శి2గా ఐఎఎస్ (రిటైర్డ్) శక్తికాంత దాస్ నియామకానికి మంత్రివర్గ నియామకాల కమిటీ ఆమోదించింది.దాస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పదవీ కాలం సాగుతుంది. ఆయన నియామకం ప్రధాని పదవీ కాలంతో లేదా తిరిగి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు, ఏది ముందైతే దానితో ముగుస్తుంది’ అని ఆ ఉత్తర్వు తెలియజేసింది.

అయితే ప్రధాని నరేంద్ర మోదీకి మాజీ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ప్రస్తుతం మొదటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 సెప్టెంబర్ 11వ తేదీ నుంచి పీకే మిశ్రా ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇప్పుడు శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఈ క్రమంలోనే పీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా శక్తికాంత దాస్‌ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్బీఐ గవర్నర్‌గా 2018 నుంచి 2023 వరకు 6 ఏళ్ల పాటు పనిచేసిన శక్తికాంత దాస్‌కు ఫైనాన్షియల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో విశేష అనుభవం ఉంది. అంతేకాకుండా ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌, మినరల్స్‌, రెవెన్యూ శాఖలతోపాటు జీ20 షెర్ఫా, ఏడీబీ బ్యాంక్‌, ప్రపంచ బ్యాంక్‌ వ్యవహారాలపైనా ఆయన గట్టి పట్టు కలిగి ఉన్నారు. 

కరోనా మహమ్మారి వెలుగుచూసిన సమయంలో ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న శక్తికాంత దాస్ దేశం ఆర్థిక పునరుద్ధరణతో సహా క్లిష్టమైన ఆర్థిక సవాళ్ల నుంచి దేశాన్ని బయటికి తీసుకురావడంలో తనవంతు కీలక పాత్రను పోషించారు. ఇక ఆర్బీఐలో శక్తికాంత దాస్ పదవి కాలం నిర్ణయాత్మక ద్రవ్య విధానాలు, సంక్షోభాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.

దాస్ 42 ఏళ్లకుపైగా విశిష్ట సేవలు అందించారు. ఆయన ప్రధానంగా ఆర్థిక, పన్నులు, పెట్టుబడి, మౌలిక వసతుల కల్పన రంగాల్లో సేవలు అందించారు. ఆర్‌బిఐ 25వ గవర్నర్ అయిన శక్తికాంత దాస్ భారత్ జి20 షెర్పాగా, 15వ ఆర్థిక సంఘం సభ్యునిగా కూడా వ్యవహరించారు.

మరోవంక,  కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ  శక్తికాంత దాస్‌ నియామకంతోపాటు నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రమణ్యం పదవీకాలాన్ని కూడా ఒక ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బీవీఆర్‌ సుబ్రమణ్యం ప్రస్తుత పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుండగా తాజాగా పొడగించారు. ఈ పొడగింపు వల్ల 2026 ఫిబ్రవరి 24వ తేదీ వరకు నీతి ఆయోగ్ సీఈఓ పదవిలో బీవీఆర్ సుబ్రమణ్యం కొనసాగనున్నారు.
 
 రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన సుబ్రమణ్యం 1987 బ్యాచ్‌కు చెందిన వారు. 2023 ఫిబ్రవరిలో నీతి ఆయోగ్‌ సీఈవోగా రెండేళ్ల పదవీకాలానికి ఆయనను నియమించగా, తాజాగా మరో ఏడాది పాటు పొడిగించారు.